- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంచార్జ్ కలెక్టర్ ఇంకెన్నాళ్లు..?
దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణకు గుండెకాయ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాకు రెగ్యులర్ కలెక్టర్ లేకపోవడంతో పాలనా పరమైన వ్యవహారాలు కుంటుపడుతున్నాయి. గత సంవత్సరం జూన్ నెలలో అప్పటి వరకు జాల్లా కలెక్టర్ గా పనిచేసిన శర్మణ్ పదవీ విరమణ చేశారు. దీంతో ఇంచార్జ్ కలెక్టర్ గా అప్పటి రంగారెడ్డి జిల్లాకలెక్టర్ అమోయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాష్ట్రంలో కలెక్టర్ల బదిలీలు జరిగినప్పటికీ అమోయ్ కుమార్ ను మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాకు బదిలీచేసి తిరిగి హైదరాబాద్ జిల్లాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇలా 11 నెలలుగా రెగ్యులర్ కలెక్టర్ లేకపోవడంతో తీవ్రఇబ్బందులు ఎదురౌతున్నాయి. రెండు జిల్లాలకు ఒకే కలెక్టర్ కావడంతో హైదరాబాద్ కు పూర్తిసమయం కేటాయించలేని పరిస్థితి ఉంది. దీంతో కలెక్టర్ కార్యాలయానికి పనులనిమిత్తం వచ్చేప్రజలతో పాటు ఇతర అన్నివిభాగాలలో పాలనాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి.
ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారాలు దొరకడం లేదు...
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కింద చేసిన ఫిర్యాదులకు సరైన పరిష్కారం లభించడం లేదని ఫిర్యాదు దారులు వాపోతున్నారు. కరోనా ప్రభావంతో 2020 నుండి రెండేళ్లకు పైగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే గతంలో శర్మణ్ కలెక్టర్ గా ఉన్నసమయంలో కార్యాలయానికి వచ్చేఫిర్యాదు దారులను నేరుగా కలిసి వారి సమస్యలకు పరిష్కారం చూపేవారు. ఆయన పదవీవిరమణ చేసిన తర్వాత ప్రజావాణి తిరిగి ప్రారంభమైనప్పటికీ దరఖాస్తులు బాక్సులకే పరిమితమయ్యాయనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో ఫిర్యాదు దారులు తమసమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీనికితోడు కార్యాలయంలో కలెక్టర్ సంతకం కోసం ఫైళ్ళు పెండింగ్ లో ఉంటున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన రోజు పెండింగ్ ఫైళ్స్ చూడడం, ప్రజాప్రతినిధులను కలువడం వంటివి జరుగుతుండడంతో సాధారణ ప్రజలు ఆయనను కలిసే అవకాశం లేకుండాపోతోంది.
కింది స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు..
ఇటీవలకాలంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపును వేగవంతం చేయడంతో పేదప్రజలు దరఖాస్తులు పట్టుకుని కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న వారితో పాటుకొత్త వారుకూడా చేతిలో కాగితాలలో పడిగాపులు గాస్తున్నారు. ఇంచార్జ్ కలెక్టర్ తో పాటు ఇతర అధికారులను కలిసి తమగోడును వెల్లబోసుకుంటున్నారు. అయితే పనిఒత్తిడి కారణంగా వారుకూడా ప్రజలకు పూర్తిసమయం కేటాయించలేకపోతున్నారు. రెగ్యులర్ కలెక్టర్ ఉన్నప్పుడే ప్రభుత్వ భూముల సంరక్షణ తలబొప్పిని కట్టిస్తుంది. అటువంటిది ఇంచార్జ్ కలెక్టర్ ఉన్నసమయంలో వాటిని కాపాడడం కింది స్థాయి అధికారులకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది.
అంతేకాకుండా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, విద్యాశాఖ, రెవెన్యూ, బీసీ వెల్ఫేర్, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్సేర్, ప్రభుత్వ వసతి గృహాల పర్యవేక్షణ, దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు వంటి అనేకశాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశాలను చాలా సందర్భాలలో కింది స్థాయి అధికారులు చేపడుతున్నారు. మరికొన్ని నెలల్లో శాసనసభ ఎన్నికలు కూడా జరుగనుండడం హైదరాబాద్ జిల్లాకు రెగ్యులర్ కలెక్టర్ అవసరం ఎంత ఉందనేది ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని పలువురు ప్రజాప్రతినిధులు సూచిస్తున్నారు.
కార్యాలయం తరలింపు..
హైదరాబాద్ జిల్లాకలెక్టర్ కార్యాలయం తరలింపు కూడా ప్రహసనంగా మరుతోంది. ఇంకా నాంపల్లి రోడ్డులోని పాతకలెక్టర్ కార్యాలయం నుండి లక్డీకాపూల్ కార్యాలయానికి పూర్తిస్థాయి తరలింపు జరుగలేదు. ఫైళ్ల తరలింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దీంతో పనుల నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కలెక్టర్ కార్యాలయం తరలింపుతో పాటు రెగ్యులర్ కలెక్టర్ ను నియమిస్తే ప్రజాసమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లాప్రజలు కోరుతున్నారు.