ప్రశాంతంగా హోలీ..బెల్ట్ దుకాణాల్లో ఏరులై పారిన మద్యం అమ్మకాలు

by Naveena |
ప్రశాంతంగా హోలీ..బెల్ట్ దుకాణాల్లో ఏరులై పారిన మద్యం అమ్మకాలు
X

దిశ , హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులలో మునిగి తేలారు. కాలనీలు, బస్తీలలో యువత తెల్లవారుజాము నుండే హోలీ వేడుకలలో మునిగిపోయారు. ఒకరిపై మరొకరు రంగులు జల్లుకుంటూ బ్యాండ్ మేళాలలో నృత్యాలు చేయడంతో పాటు.. ఎదురుపడిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు హాజరయ్యారు. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో యువత సందడి చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్న వారితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. వారి ఉత్సాహానికి సంగీతం ఇంకాస్త జోష్ పెంచింది. హుషారెత్తించే డీజే సాంగ్స్ స్టెప్పులతో హోరెత్తించారు.

ఇవే కాకుండా పలు హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, రిసార్ట్స్ తదితర ప్రాంతాలో ఈవెంట్లు జరుపుకున్నారు. బేగంబజార్, ఎల్బీ నగర్, కోఠి, ఎంజే మార్కెట్, అబిడ్స్ , నాంపల్లి , సికింద్రాబాద్, కూకట్ పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఇలా ప్రాంతాలతో ప్రమేయం లేకుండా నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి .

పోలీసుల ఆంక్షలు...

హైదరాబాద్ నగర వ్యాప్తంగా జరుపుకునే హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు విధిగా వైన్స్ లు, బార్లు మూసివేశారు. రోడ్లపై వెళ్లేవారిపై రంగులు జల్లరాదని, గుంపులుగా తిరిగి ఇతరులకు ఇబ్బందులు కల్గించరాదని సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన నేపథ్యంలో.. హోలీ వేడుకలు ప్రశాంతంగా ముగిసాయి .

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు..?

హోలీ పండుగను పురస్కరించుకుని వైన్స్ లు, బార్లు మూసివేయడంతో బెల్టు షాప్ లలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు మద్యం అమ్మకాలపై దృష్టి సారించకపోవడంతో మద్యం ఏరులై పారింది. బెల్టు షాప్ ల నిర్వాహకులు ముందు రోజే మద్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్నారు. హోలీ రోజున దాదాపు రెట్టింపు ధరలకు అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. ధరల గురించి అడిగిన వారికి మద్యం లేదని చెబుతుండడంతో.. తప్పనిసరి పరిస్థితులలో వారు అడిగినంత ఇచ్చి కొనుగోళ్లు చేశారు. బెల్టు షాప్ ల గురించి అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు వాపోయారు .

పోలీసుల అలర్ట్...

రంజాన్ మాసం రెండవ శక్రవారం రోజుననే హోలీ పండుగ రావడంతో ..పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టింది. ముఖ్యంగా పాతబస్తీలో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడంతో పాటు అనుమానిత ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేశారు . అయితే హోలీ పండుగ ప్రశాంతంగా ముగియడంతో పోలీస్ శాఖ ఊపిరి పీల్చుకుంది,

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed