అమ్మో మాతోని కాదు.. సర్కిళ్లలో ఎన్నికల విధులు తిరస్కరణ

by Disha Web Desk 1 |
అమ్మో మాతోని కాదు.. సర్కిళ్లలో ఎన్నికల విధులు తిరస్కరణ
X

దిశ, సిటీ బ్యూరో: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ డ్యూటీలు చేసేందుకు జీహెచ్ఎంసీ ఉద్యోగులు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఎలక్షన్ డ్యూటీలు చేసేందుకు సుమారు 28 ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 32 వేల 500 మంది ఎలక్షన్ స్టాఫ్‌ను నియమించగా.. అందులో దాదాపు రెండున్నర వేల మంది ఇప్పటి వరకు జరిగిన పలు శిక్షణ తరగతులకు గైర్హాజరు కావటంతో వారిలో 42 మందిపై ఇప్పటికే ఎన్నికల అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేసి, క్రిమినల్ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఏకంగా రెండున్నర వేల మంది ఎలక్షన్ డ్యూటీలకు గైర్హాజరు కావటం, మొత్తం సిబ్బందిలో 20 శాతం మంది ఉద్యోగులను రిజర్వు స్టాఫ్ కింద నియమించినా, సిబ్బంది కొరత తలెత్తటంతో ఆ సమస్యను ఎలా అధిగమించాలంటూ తలలు పట్టుకున్న ఎన్నికల విభాగం అధికారులకు ఇప్పుడు మూడో, నాలుగో తరగతి సిబ్బంది నుంచి మరో సమస్య ఎదురైనట్లు సమాచారం. రేపోమాపో జిల్లా ఎన్నికల అధికారి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఖరారు చేయనున్న డీఆర్సీ సెంటర్లలో ఎలక్షన్ మెటీరియల్ అందించేందుకు మూడు, నాలుగో తరగతి సిబ్బంది వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నట్లు సమాచారం.

గత నవంబర్‌లో చేసిన అసెంబ్లీ ఎలక్షన్ డ్యూటీలకు సంబంధించిన జీతాలే ఇంకా చెల్లించలేదని, ఇప్పుడు మళ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ డ్యూటీలు ఎలా చెల్లించాలని కొందరు ప్రశ్నించగా, మరి కొందరు తాము అసెంబ్లీ ఎన్నికల్లో 56 రోజుల పాటు ఎలక్షన్ డ్యూటీ చేస్తే తమకు ఇవ్వాల్సినంత జీతం ఇవ్వలేదని, జీతాల పంపిణీలో కొందరు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు చేతివాటం ప్రదర్శించారని ఆరోపిస్తున్నట్లు సమాచారం. తమకు అంతంతమాత్రంగా జీతాలు చెల్లించి, శ్రమదోపిడీ చేసిన తర్వాత తామెలా మళ్లీ ఎలక్షన్ డ్యూటీలు చేస్తామంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఎలక్షన్ డ్యూటీలను తిరస్కరించిన ఘటనలు ఇప్పటి వరకు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం పరిధిలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

Next Story

Most Viewed