- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking News : సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన మున్నూరు కాపు నేతలు

దిశ, వెబ్ డెస్క్ : తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇంటిని మున్నూరు కాపు సంఘం(MunnuruKapu Sangham Protest) నేతలు ముట్టడించారు. ఎన్నికల సమయంలో మున్నూరు కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇపుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీని గాలికి వదిలేసారని.. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మున్నూరు కాపు ఆత్మగౌరవ మహాధర్మసేన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి ప్రయత్నించారు. సంస్థ రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ నాయకత్వంలో సభ్యులు జూబ్లీహిల్స్ రోడ్ నెం 36 నుంచి సీఎం నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లేందుకు యత్నిస్తున్న సంస్థ కన్వీనర్ శ్రీనివాస్ పటేల్‌తో సహా పదిమందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణనలో మున్నూరు కాపుల జనాభాను తక్కువ చేసి చూపించారని ఆరోపించారు. రాజకీయంగా మున్నూరు కాపులు ఎదుగుతారనే దురాలోచనతో పలు జిల్లాల్లో మున్నూరు కాపులను ఓసీ జాబితాలోకి చేర్చారన్నారు. గత ప్రభుత్వం హయాంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం తాము ఆందోళన చేస్తున్నప్పుడు మద్దతు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాత్రం నోరుమెదపడం లేదని మండిపడ్డారు. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని ఎండోన్మెంట్ పరిధిలో నుంచి తొలగించాలని, మున్నూరు కాపుల పేరు చివరన అందరికీ పటేల్ అని చేర్చేలా గెజిట్ విడుదల చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.