కాంగ్రెస్ కార్పొరేటర్ పై ఎమ్మెల్యే అనుచరుల దాడి..

by Sumithra |
కాంగ్రెస్ కార్పొరేటర్ పై ఎమ్మెల్యే అనుచరుల దాడి..
X

దిశ, ఎల్బీనగర్ : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరుస దాడులతో హడలెత్తిస్తున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్ ఇక్కడి నుండి వెళ్లగానే బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇంచార్జ్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పై దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం మన్సూరాబాద్ ఎం.ఈ రెడ్డి గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఉత్సవాలు జరుగుతుండగానే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలోనే అతని అనుచరులు కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పై, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి పై దాడి చేశారు. అంతే కాకుండా హాల్లో నుంచి బయటికి లాక్కెళ్ళారు. దీంతో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఎం.ఈ రెడ్డి గార్డెన్ ఆవరణలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే సమక్షంలోనే ఇరు వర్గాలు దాడులకు దిగడంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది, నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

బీఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తున్నాం.. మల్ రెడ్డి రాంరెడ్డి

కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పై, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి పై బీఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి అన్నారు. ఎం.ఈ రెడ్డి గార్డెన్ లో జరిగిన దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై పోలీసులు వెంటనే హత్యాయత్నం కేసునమోదు చేసి కఠినంగా శిక్షించాలని మల్ రెడ్డి రాంరెడ్డి డిమాండ్ చేశారు.

ప్రశ్నించే వారిపై దాడులు హేయం.. దర్పల్లి రాజశేఖర్ రెడ్డి

ఇటీవలి కాలంలో ప్రశ్నించే వారి పై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అతని గుండాలు దాడులకు దిగడం పరిపాటిగా మారిందని కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సుధీర్ రెడ్డి అక్రమాల పై ప్రశ్నిస్తున్నందుకే జీర్ణించుకోలేక ఆయన గుండాలతో తనపై దాడి చేయించారని మండిపడ్డారు. సుధీర్ రెడ్డి స్థానికేతరుడని.. గతంలో మలక్ పేట్ నియోజకవర్గం అక్బర్ బాగ్ కౌన్సిలర్ గా గెలిచినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి భిక్షతో కూడా చైర్మన్ అయ్యాడని గుర్తు చేశారు. అనంతరం వైఎస్ఆర్ బిక్షతోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని తెలిపారు. తామంతా కష్టపడి, అతని కోసం రాత్రి, పగలు కృషిచేసి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామన్నారు. 2018 లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకుంటే స్వార్థ బుద్ధితో బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు అతని కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ, నాయకులు కార్యకర్తలపైనే దాడులకు దిగడం సిగ్గుచేటు అన్నారు. తిరిగి అతడిని ప్రజలు తన సొంత ప్రాంతమైన మలక్ పేట్ కు పంపే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed