తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గడిచిన 10 నెలల్లో వివిధ రిక్రూట్ మెంట్ బోర్డుల ద్వారా 53,310 పోస్టులను భర్తీ చేసి, తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం జాతీయ రికార్డును నెలకొల్పిందని, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లిలో పాల్గొనే ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియమాకాలు, యువజనసాధికారత, ప్రభుత్వ విజయాలను మీడియా ముఖంగా ప్రజలకు వివరించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో కొత్తగా ఎంపికైన 593 మంది ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి నియామాక పత్రాలు అందజేస్తారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గతేడాది 2,165 ఉద్యోగాల కల్పన, కాంట్రాక్టు కార్మికులకు అదనంగా రూ. 5000 బోనస్ ను అందించామని వెల్లడించారు. గ్రూప్ 4 ద్వారా ఎంపికైన 8,143 మంది అభ్యర్థులు, 442మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో సహా 9 వేల మందికి నియామాక పత్రాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకోవడమే కాక డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ ప్రారంభంమే కాకుండా వివిధ రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను ప్రదర్శించే విధంగా 40 స్టాల్స్ ను ఈ సభలో ప్రదర్శిస్తున్నామని వెల్లడించారు. మెగా డీఎస్సీ ద్వారా 11,062 ప్రకటించి, 10, 006 పోస్టులను భర్తీ చేశామన్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌‌ను సంస్కరించాం

13 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షను మా కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్లుగా గ్రూప్-1 నోటిఫికేషన్‌లను జారీ చేయకుండా, పేపర్ లీక్, నోటిఫికేషన్ల సాగదీత వ్యవహారంతో ఎంతోమంది పలు మార్లు పరీక్షలకు హాజరు కావాల్సి వచ్చిందని విమర్శించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో పారదర్శకంగా ఉండేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కరించిందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 3,393 పోస్టులు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 6,956 పోస్టులు, తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా 16,067 పోస్టులు, తెలంగాణ రెసిడెన్షియల్ఎడ్యుకేషనల్ ద్వారా 8,304 పోస్టులతో పాటు అదనంగా టీఆర్ఈఐఆర్ బీ (ట్రిబ్) లో 10,వేల పోస్టులు, పాఠశాల విద్య కోసం మరో 5,378 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. టీజీటీలు, పీజీటీలు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, రెసిడెన్షియల్ సొసైటీల్లో టీచింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే అపాయింట్ మెంట్ లెటర్లు జారీ చేశామని వెల్లడించారు.

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు

రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆనంద్ మహీంద్రా అధ్యక్షతన ఉన్న ఈ సంస్థ, టాటా టెక్నాలజీస్ ఇతర పరిశ్రమల ప్రముఖుల సహకారంతో లాజిస్టిక్స్, ఇ-కామర్స్, హెల్త్‌కేర్ , లైఫ్ సైన్సెస్‌లలో గ్లోబల్-స్టాండర్డ్ శిక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీని కోసం రూ. 2,700 కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా అథ్లెట్లకు శిక్షణ ఇచ్చేందుకు 200 ఎకరాల్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుపేద యువతకు మద్దతుగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను 20 నుంచి 25 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తూ వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందన్నారు. దీనికోసం రూ. 5000 కోట్లను ఈ ఏడాది ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాలను ఫ్రీ స్కూల్స్ గా మార్చుతున్నామని, సింగరేణి కార్మికుల కోసం కారుణ్య నియామాకాలు చేపడతున్నామన్నారు. తెలంగాణను విద్య,ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

అంతకుముందు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల పనితీరును మంత్రి సమీక్షించారు. రైతులకు మేలు జరిగేలా వరి సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సన్న వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను వెంటనే చెల్లించాలన్నారు.

Advertisement

Next Story