- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మితిమీరుతున్న కోఆర్డినేటర్ల అక్రమాలు
దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో ఔట్ సోర్స్ చిన్న స్థాయి ఉద్యోగి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఎవరూ కూడా పైసలియ్యందే పని చేయటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు డిమాండ్ చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే కోవకు చెందిన వారే సర్కిళ్ల వారీగా శానిటేషన్ పనులను పర్యవేక్షిస్తున్న కో ఆర్డినేటర్లు. స్వీపింగ్ వంటి శానిటేషన్ విధులను ఇప్పటికే క్షేత్ర స్థాయిలో మెడికల్ ఆఫీసర్లు, పలు చోట్ల ఇంజనీర్లు, శానిటరీ సూపర్ వైజర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు పర్యవేక్షిస్తున్నారు. వీరందరూ గాక, శానిటేషన్ పనులు ఫీల్డు లెవెల్‌లో మరింత పారదర్శకంగా, మెరుగుగా జరిగేందుకు వీలుగా గతంలో కొందరు ఉన్నతాధికారులు కో ఆర్డినేటర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
శానిటేషన్ పనులు మెరుగుగా జరగడం, విధి నిర్వహణలో పారదర్శకత దేవుడెరుగు గానీ వీరి దందాలు మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు పలువురు బాధితులు వాపోయారు. తొలుత తొమ్మిది మంది కో ఆర్డి నేటర్లను నియమించిన అధికారులు అందులో ఇద్దర్ని ప్రధాన కార్యాలయంలో నియమించి, మిగిలిన ఏడుగురిని ఫీల్డ్ లెవెల్ విధులకు వినియోగించేవారు. కానీ వీరి సంఖ్య ప్రస్తుతం ఏడుకు పడిపోయిన, వీరి ఆగడాలు మితిమీరిపోతున్నట్లు ఆరోపణలున్నాయి. పదేళ్ల క్రితం నియామకాలు జరిగిన నాటి నుంచి వీరికి బదిలీలు గానీ, వీరి పని తీరు పట్ల ప్రశ్నించే వారు గానీ లేకపోవటంతో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతుంది.
కానీ కొందరికి ఉపాధి కల్పించేందుకే అధికారులు ఈ వ్యవస్థను తీసుకువచ్చారంటూ అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలొచ్చాయి. కానీ ఉపాధి కోసమే గాక, అక్రమంగా, అడ్డదారిలో కోట్లు సంపాదించుకునేందుకే ఈ కో ఆర్డినేటర్లు పరిమితమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖైరతాబాద్, ఆబిడ్స్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వీరు మెడికల్ ఆఫీసర్లు లేని చోట ఫుల్ హవా కొనసాగిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో తామే మెడికల్ ఆఫీసర్లమని చెప్పుకోగా, స్వీపింగ్ బిల్లులు, హాస్టళ్లకు నోటీసులు జారీ చేస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
యూనిట్‌కు వెయ్యి
శానిటేషన్ విధుల్లో భాగంగా నగరాన్ని స్వీపింగ్ గ్రూప్‌లు ఎంత వరకు శుభ్రపరుస్తున్నాయన్న విషయాన్ని పక్కనబెడితే ప్రతి నెల స్వీపింగ్ గ్రూప్‌ల జీతాలు బిల్ చేసేందుకు ఒక్కో గ్రూప్ నుంచి రూ. వెయ్యి ఇవ్వనిదే ఫైలు ముందు జరగడం లేదని పలువురు స్వీపర్లు వాపోతున్నారు. నగరంలోని 30 సర్కిళ్ల పరిధిలో వేలాది మంది కార్మికులు స్వీపింగ్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో యూనిట్ లో ఏడుగురు కార్మికులుండగా, ఇలా ప్రతి మూడు గ్రూపులకు ఓ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ పర్యవేక్షిస్తారు. వీరు గాక, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు కూడా క్షేత్ర స్థాయిలో యూనిట్ ల పనితీరును పర్యవేక్షిస్తున్నారు. వీరే గాక, కో ఆర్డినేటర్లు కూడా ఈ యూనిట్ లను పర్యవేక్షిస్తున్నారు. ఈ యూనిట్ ల హాజరు, శాలరీ బిల్లులు వంటివి ఈ కో ఆర్డినేటర్లే చూస్తుంటారు. అదే అదునుగా ఒక్కో స్వీపింగ్ యూనిట్ నుంచి నెలకు రూ. వెయ్యి డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
చెల్లించని పక్షంలో ఆ గ్రూప్ జీతాల బిల్లులను ఆలస్యం చేయటం, హాజరును గైర్హాజరుగా చూపించడం వంటి వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇక ఏదైనా గ్రూప్ లో కార్మికుడి స్థానంలో వేరే వారిని నియమించాలన్నా, వీరికి లక్షలు సమర్పించాల్సిందేనని కార్మికులు వాపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని 30 సర్కిళ్లలో దాదాపు మెజార్టీ సర్కిళ్లలో కో ఆర్డినేటర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులో ఓ కో ఆర్డినేటర్ మహిళా స్వీపర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, మరి కొందరైతే ఏకంగా ఇక్కడ పని చేయాలంటే ఇవన్నీ పట్టించుకోవద్దంటూ బాధితులకు కౌంటర్ ఇస్తున్నట్లు సమాచారం.