అంతరాష్ట్ర దొంగల ముఠా పట్టివేత

by Sridhar Babu |   ( Updated:2023-12-30 12:57:46.0  )
అంతరాష్ట్ర దొంగల ముఠా పట్టివేత
X

దిశ, భీంగల్ : అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరు గ్రామాల్లో తాళాలు వేసిఉన్న ఇండ్లను టార్గెట్ చేసి పట్టపగలే చోరీ చేస్తున్నారు. వీరి నుండి 18 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మోర్తాడ్ ఎస్సై అనిల్ రెడ్డి చాకచక్యంగా వీరిని పట్టుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ శనివారం మోర్తాడ్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ లో దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్ర కు చెందిన ముండ్కర్ నాందేవ్, మాణిక నారాయణ్ షిండే, శివానంద్ గంగాధర్ అనే నిందితులు శనివారం తెల్లవారు జామున మోర్తాడ్ రైల్వే స్టేషన్ సమీపంలో

అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై, సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులను విచారించగా దొంగతనాలకు పాల్పడట్టు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితులు వేల్పూర్ మండలం పచ్చల నడుకుడలోని ఒక ఇంట్లో, మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో ఏలేటి శంకర్ ఇంట్లో చొరబడి బంగారం, నగదును దోచుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద 18 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ వివరించారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అనిల్ రెడ్డి, సిబ్బంది ఏ. శ్రీనివాస్, నవీన్ చంద్ర, నరేష్, రమేష్, కేర్బాజీలను డిస్ట్రిక్ట్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయరాం రివార్డ్ లను ఇచ్చి అభినందించారు.

Advertisement

Next Story