Cyber Crime : సైబర్ నేరాలపై పోలీసుల వినూత్న ప్రచారం

by Sumithra |   ( Updated:2023-09-11 17:10:27.0  )
Cyber Crime : సైబర్ నేరాలపై పోలీసుల వినూత్న ప్రచారం
X

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర తీసుకుంటున్న చర్యలు సక్సెస్ అవుతున్నాయి. వినూత్న రీతిలో ప్రచారం చేపట్టి ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మామూలు కరపత్రాలనే వినూత్న రీతిలో ప్రజలు వాటిని చూడగానే ఆకట్టుకునేలా ముద్రించి రోడ్లపై జనం రద్దీగా ఉండే చోట్ల ఉంచుతున్నారు. కొందరికి చేతులకు ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా కరపత్రాలు పంచుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాం.

ఒకవేళ కరపత్రాలు తీసుకున్నా అందులో ఏముందో చూడకుండానే పడేస్తాం. కానీ తెలంగాణ పోలీసులు పంపిణీ చేసే కరపత్రాలను మాత్రం కిందపడేసినా తీసుకుంటున్నారు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుండడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో అచ్చం మనీ పర్స్ మాదిరిగానే వుండే పాంప్లెట్స్ ముద్రించి సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన డయల్ 1930 నంబర్‌పై అవగాహన కల్పిస్తున్నారు.

డబ్బులు ఊరికే ఎవరికీ రావు.. ఈ పర్స్ లాగే ఏదో ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సందేశం ఇస్తున్నారు. అసలేదో, నకిలీ ఏదో గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో డబ్బులతో కూడిన మనీ పర్స్ పాంప్లెట్స్ వేసి ప్రజల స్పందనను తెలుసుకుంటున్నారు పోలీసులు. నిజంగానే డబ్బులు దొరికాయని పర్స్ తీసుకుని తెరిచిచూస్తున్న వారి స్పందనను రికార్డ్ చేస్తున్నారు. ఈ వీడియోలు ఫన్నీగా ఉండటంతో వాటికి జనాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed