మణికొండ మున్సిపాలిటీలో జోరుగా అక్రమ కట్టడాలు

by Javid Pasha |
మణికొండ మున్సిపాలిటీలో జోరుగా అక్రమ కట్టడాలు
X

మణికొండ మున్సిపాలిటీలో 'తాము గీసిందే గీత.. రాసిందే రాత' అనే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉండడంతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అభివృద్ధిలో మున్సిపాలిటీ దూసుకుపోతున్నా అక్రమ నిర్మాణాల పీడ మాత్రం వీడడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమ కట్టడాలకు ప్రజాప్రతినిధులే అండగా నిలవడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకుని అక్రమ నిర్మాణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దిశ, గండిపేట: నగర శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతే ఉండడం లేదు. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంలో శివారు ప్రాంతమైన మణికొండ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో మున్సిపాలిటీ మీద అక్రమ నిర్మాణాల నీడ పడింది. దీనికి అడ్డు చెప్పాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మౌనంగా ఉంటున్నారు. ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాదారులు రోజురోజుకూ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తీసుకున్న అనుమతులకు, చేపట్టే నిర్మాణాలకు పొంతన కుదురడం లేదు. బహుళ అంతస్తులు, సెల్లార్ల నిర్మాణం, సెట్ బ్యాక్ లు లేకపోవడం ఇలాంటి ఎన్నో అవకతవకలు ఆయా నిర్మాణాల్లో కనిపిస్తున్నాయి.

నిబంధనలకు నీళ్లు..

నార్సింగి మీదిగా బీఆర్‌సీ మణికొండ వెళ్లే రహదారిలో క్యాండుట్ కాలువ ఉంది. కాలువ పక్కన నిర్మాణం చేపట్టాలంటే నిర్మాణానికి కాలువకు మధ్య దూరం 30 ఫీట్లు ఉండాలి. కానీ ఆ కాలువకు 15 ఫీట్ల దూరమే వదిలి ఓ సంస్థ నిర్మాణం చేపడుతుంది. దీంతో మణికొండ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి మాత్రం తనిఖీ చేసి అనుమతులు ఉన్నాయని చెప్పడం గమనార్హం.

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి..

ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏర్పాటైన మణి కొండ మున్సిపాలిటీలో మాత్రం అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో యథేచ్చగా అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నా వాటి వంక చూడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కానరాని టౌన్ ప్లానింగ్ అధికారులు..

మణికొండ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా కమిషనర్ ఆధీనంలో ఉండే టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడం అనేక సందేహాలకు ఊతమిస్తుంది. సామాన్యుల వద్ద ముక్కు పిండి పన్నులు వసూలు చేసే అధికారులు అక్రమ నిర్మాణాలను ఉపేక్షించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ఉందా లేదా అనే సందేహం కలిగేలా ఆ విభాగం పని తీరు ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed