నిజాం కాలం నాటి బురుజు గోడను కూల్చి అక్రమ నిర్మాణం.. పట్టించుకొని అధికారులు

by Mahesh |
నిజాం కాలం నాటి బురుజు గోడను కూల్చి అక్రమ నిర్మాణం.. పట్టించుకొని అధికారులు
X

దిశ, సికింద్రాబాద్ : అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిజాం కాలం నాటి పురాతన వారసత్వ కట్టడాలు మట్టిలో కలిసిపోతున్నాయి. సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తార్నాక డిజన్ లాలాపేట ప్రధాన రహదారి పక్కనే నిజాం కాలం నాటి కమాన్ (దర్వాజా), దానికి ఆనుకుని బురుజు గోడలు ఉన్నాయి. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం పురాతన కట్టడాలను కూల్చివేస్తున్నారు. లాలాపేట కమాన్ (దర్వాజా) అంటేనే ఒక ల్యాండ్ మార్క్‌గా చెప్తారు. అలాంటి వారసత్వ కట్టడాన్ని కూల్చివేస్తూ రెండు నిర్మాణాలు సాగుతున్నాయి.

నిర్మాణాలకు ప్రధాన రహదారి మధ్యలో బురుజు గోడ ఉండడంతో గోడను తొలగించి నిర్మాణదారుడు ప్రధాన రహదారి వైపు దారిని ఏర్పాటు చేసుకున్నారు. గోడ లోపల ఉన్న ఇళ్ల యజమానులకు బురుజు గోడ నుంచి సెట్‌బ్యాక్ తీసుకోవాలని ప్రభుత్వం చెబుతూ దానికి డబ్బులు కూడా చెల్లించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం గోడను కూల్చి రెండు నిర్మాణాలు సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే గోడలు నిర్మాణదారులు కూల్చలేదని, అదే కూలిపోయిందని చెప్పడం గమనార్హం. కూలిన గోడలను తిరిగి నిర్మించాల్సిన అధికారులు చోద్యం చూస్తుందటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు..

పురాతన కట్టడాలను కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కాలక్రమేణా ఆ కట్టడాలు కనుమరుగైపోతున్నాయి. ఆక్రమణదారుల బరితెగింపులతో నిజాం కాలం నాటి బురుజు గోడలు మట్టిలో కలిసిపోతున్నాయని పలువురు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం గోడలను ఎవరూ కూల్చలేదని, అదే కూలిపోయిందని చెప్తున్నారు. కూలిన గోడను తిరిగి నిర్మించాలని పలువురు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండపోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గోడను తిరిగి నిర్మించాలి : స్థానికులు

పురాతన బురుజు గోడను తిరిగి నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారికి అడ్డుగా ఉందని నిర్మాణదారులు కూల్చినప్పటికి, అదే కూలిపోయిందని అధికారులు చెప్పడడం హాస్యాస్పదంగా ఉందని, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయ లోపంతో సమస్య పెరిగిపోతుందన్నారు. తక్షణమే రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి గోడను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed