రారా మామా తిందాం.. కొత్త కొత్త పేర్లు.. కొంగొత్త వెరైటీలు..

by Aamani |
రారా మామా తిందాం.. కొత్త కొత్త పేర్లు.. కొంగొత్త వెరైటీలు..
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ భోజన ప్రియులకు స్వర్గధామం. ఇక్కడ ఇండియన్, కాంటినెంటల్, చైనీస్, ఇటలీ, మొగలాయిస్, తందూరి ఇలా ఎన్నో పేర్ల వంటకాలు భోజన ప్రియుల నోర్లు ఊరిస్తాయి. గల్లీల నుండి మొదలు స్టార్ హోటల్స్ వరకు ఎన్నో వెరైటీ వంటకాలు ఆహా అనిపిస్తూ ఉంటాయి. రకరకాల వంటకాలతో ఇటు నగర ప్రజలను, అటు పర్యాటకుల మనసు దోచుకుంటాయి. ఇక్కడి వంటకాలే కాదు పేర్లు కూడా ఇప్పుడు ఎంతో మందిని ఆకర్షిస్తున్నాయి. అంతేనా ఒక్కో పేరు చూస్తే ఒక్కసారైనా ఆ హోటల్ కు వెళ్లి తిని రావాలి అనిపిస్తుంది. అంత వెరైటీ పేర్లతో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి హోటల్స్. ఇప్పుడు నగరంలో హోటల్స్, రెస్టారెంట్ల పేర్లు తెగ ట్రెండింగ్ లో ఉన్నాయి.

హోటళ్లకు వెరైటీ పేర్లు..

ఓ వైపు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలంటూ డాక్టర్లు సూచిస్తుంటే మరోవైపు కొత్త కొత్త పేర్లతో హోటళ్లు నోరూరిస్తున్నాయి. గతంలో హోటళ్లకు చిన్న పిల్లల పేర్లు, దేవుళ్ళ పేర్లు మాత్రమే ఉండేవి. కానీ కాలం మారిన కొద్దీ హోటళ్ల పేర్లు కూడా మారిపోతున్నాయి. హోటల్ భోజనం అంత మంచిది కాదు అంటుంటే.. రారా మామా తిందాం అని ఓ హోటల్ పిలిస్తే.. బొజ్జ నింపుకుందాం రమ్మంటుంది మరో హోటల్.


ఇట్లు, వంటిల్లు, అంతేరా, వనం, తాజా, పక్కా లోకల్, ఔరా, కావ్యం, కడలి, భలా, కంచి, రామేశ్వరం, ఆహా, అద్భుతం అః, గ్రామీణం, దొరబాబు బిర్యానీ, డైలీ రిచువల్స్, నన్నయ, గుంటూరు గోంగూర, యాట కూర.. తోటకూర, బార్బీక్ హోలీక్, పక్కింటి రుచులు, పొరుగుంటి పుల్లకూర, రోకలి, జాజు, దిబ్బరొట్టె, ఇష్టం, తెలుగు అరోమా, ఆకలి రాజ్యం, ఇతిహాస్, నానీస్, రాజధాని, పెళ్ళి భోజనం, కోడి కూర చిట్టిగార, చిగురు, ఇగురు, ఇంటి భోజనం, గ్రామీణం, కొండవీడు, తినేసి పో, ఉప్పూ కారం, సాల్ట్ అండ్ పెప్పర్, రాయలసీమ రుచులు, రాజుగారి రుచులు, గోదావరి రుచులు, కోనసీమ వంటిల్లు, కృష్ణపట్నం, మా పల్లె వంటకాలు, అమ్మ చేతి వంట, తెలుగు మీడియం ఇలా ఎవరికి తోచిన పేర్లు పెడుతున్నారు.


కొత్త కాన్సెప్ట్..

రకరకాల హోటళ్లు మాత్రమే కాదు.. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో, థీమ్డ్ బేస్ రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. అందులోని వంటకాలు కూడా వెరైటీ పేర్లతో భోజన ప్రియులను నోరూరిస్తున్నాయి. తాగుబోతు కోడి, ఊరమాస్ అంటూ వంటకాలకు కూడా అనేక పేర్లు పెట్టేస్తున్నారు. అటు గోవా, బాలి, ఔటఫ్ స్టేషన్, లైటింగ్, గ్రీనరి, తెలుగు సినిమా, ఫారెస్ట్ థీమ్ అంటూ అనేకానేక కొత్త కొత్త థీమ్స్ తో రెస్టారెంట్లు, హోటల్స్ వెలుస్తున్నాయి. అయితే వాటిలో కొన్నింటికి మాత్రమే ఆదరణ లభిస్తుండగా, చాలా హోటల్స్ మూణ్నాళ్లకే మూతపడి భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

Next Story

Most Viewed