గ్రేటర్ లో బీఆర్ఎస్ కు మరోషాక్... కాంగ్రెస్ లో చేరిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

by Disha Web Desk 15 |
గ్రేటర్ లో బీఆర్ఎస్ కు మరోషాక్... కాంగ్రెస్ లో చేరిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ , సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఐవీఎఫ్ ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బుధవారం కాంగ్రెస్​లో చేరారు. రోడ్​ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రెటరీ కుమార్ రావుల ఆధ్వర్యంలో ఆలిండియా జాతీయ కాంగ్రెస్ పార్టీ(ఏఐసీసీ) జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి సమక్షంలో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీనివాస్ గుప్తాకు వారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రోహిత్ చౌదరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు పరిచిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగుర వేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, కేంద్రంలో ఈ దఫా ఇందిరమ్మ పాలన రానున్నదని ఆయన జోష్యం చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ ఘనతని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. జాతీయ స్థాయిలో ఆర్యవైశ్యులను ఏకం చేసి, వారికి మేలు జరిగేలా కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు విన్నవిస్తామని తెలిపారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి, లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ను గెలిపిస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీల పథకం అమలు నచ్చి, కాంగ్రెస్ లో చేరినట్లు ఆయన వివరించారు. అనంతరం తెలంగాణ యూత్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టా రవికుమార్, ఐవీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్, కటకం శ్రీనివాస్, నరేష్ గుప్తా, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సాంబు పాండు గుప్తా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్, 33 జిల్లాల వైశ్య నాయకులు, ఉప్పల యువసేన నాయకులు, బీసీ, మైనార్టీ నాయకులు మహ్మద్, బాషా, ఆసీఫ్ సహా దాదాపు మూడు వందల మందికి పైగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామ్ మోహన్ గౌడ్ తదితరులు పాల్గొని, పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

Next Story

Most Viewed