జీహెచ్ఎంసీలో ఆ ఉద్యోగులు రెండు డ్యూటీలు చేయాల్సిందే

by Disha Web Desk 12 |
జీహెచ్ఎంసీలో ఆ ఉద్యోగులు రెండు డ్యూటీలు చేయాల్సిందే
X

దిశ, సిటీబ్యూరో: సాధారణంగా జీహెచ్ఎంసీ ట్యాక్స్ కలెక్షన్ చేసే క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్నికలొచ్చినపుడు ఎన్నికల విధులు, ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలైన జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ట్యాక్స్ కలెక్షన్ విధులు నిర్వర్తించే వారు. కానీ జీహెచ్ఎంసీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిన తర్వాత గడిచిన నాలుగేళ్లుగా ఒకేసారి రెండు రకాల డ్యూటీలు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా ఇటీవల నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ట్యాక్స్‌ను క్షేత్రస్థాయిలో కలెక్షన్ చేసే 145 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, 300 మంది బిల్ కలెక్టర్లకు డైలీ కలెక్షన్ టార్గెట్లు ఇచ్చేవారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వహిస్తూనే, కలెక్షన్ విధులు కూడా చేయాలని అధికారులు అల్టిమేటం జారీ చేయటంతో సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టారు.

డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగియడంతో హమ్మయ్య..అంటూ సిబ్బంది ఊపిరిపీల్చుకుని హాయిగా ట్యాక్స్ కలెక్షన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో గత నెల 16న ఎంపీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది. అసలే గత ఆర్థిక సంవత్సరం చివరి మాసం కావటం, కలెక్షన్ చేయాల్సిన టార్గెట్‌కు ఎంతో దూరం ఉండటంతో ఆశించిన స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ కాదంటూ ట్యాక్స్ విభాగం అధికారులే బాహాటంగా చెప్పినా, ఆర్థిక సంవత్సరం చివరికల్లా రూ.1900 కోట్ల పైచిలుకు ట్యాక్స్ కలెక్షన్ కావడంతో జీహెచ్ఎంసీ ట్యాక్స్ స్టాఫ్ సంబురాలు కూడా చేసుకుంది. ప్రస్తుతం కూడా ఎంపీ ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ డ్యూటీలు చేస్తున్న ట్యాక్స్ సిబ్బంది దానికి సమాంతరంగా కలెక్షన్ డ్యూటీలు కూడా చేయాలని అధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇచ్చిన టార్గెట్లకు తగిన విధంగా రెండు డ్యూటీలు చేయాల్సిందేనని అధికారులు సిబ్బందికి తేల్చి చెబుతున్నట్లు సమాచారం.

టార్గెట్ కంప్లీట్ చేస్తారా?

ప్రస్తుతం కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) మొదటి నెల కావడంతో వర్థమాన ఆర్థిక సంవత్సరం చెల్లించాల్సిన పన్నును ముందస్తు చెల్లించేందుకు వీలుగా సర్కారు 5 శాతం రిబేటు ఆఫర్ ఇచ్చి ఎర్లీబర్డ్ స్కీంను అమలు చేస్తుంది. కేవలం ఏప్రిల్ ఒక్క నెలలో మాత్రమే అందుబాటులో ఉండే ఎర్లీబర్డ్ ద్వారా రూ.800 కోట్ల కలెక్షన్ చేయాలని ఉన్నతాధికారులు ట్యాక్స్ సిబ్బందికి టార్గెట్‌గా నిర్ణయించారు. కానీ ఈ నెల ముగిసేందుకు ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండటం, ఇప్పటి వరకు కేవలం రూ.300 కోట్ల పైచిలుకు మాత్రమే పన్ను వసూలు కావడంతో మరోసారి అధికారులు ఎలక్షన్ డ్యూటీలతో పాటు కలెక్షన్ డ్యూటీలు కూడా నిర్వర్తించాల్సిందేనంటూ ఆంక్షలు విధించినట్లు సమాచారం.

ఇందుకు గాను అదనపు కమిషనర్ (రెవెన్యూ), అదనపు కమిషనర్ (ఫైనాన్స్), చీఫ్ వ్యాల్యుయేషన్ ఆఫీసర్ (సీవీఓ)లతో కమిషనర్ ట్యాక్స్ కలెక్షన్‌తో పాటు ఎలక్షన్ విధులు అప్‌డేట్ కోసం తరుచూ టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లను కూడా టెలీకాన్ఫరెన్స్‌లోకి తీసుకోవటంతో వారు తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఎర్లీబర్డ్ స్కీమ్‌కు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఒక వైపు ఎలక్షన్ డ్యూటీలు చేస్తూనే, రానున్న ఆరు రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. కానీ నెలాఖరు వరకు కనీసం రూ.600 కోట్ల ఎర్లీబర్డ్ టార్గెట్ దాటించేలా ట్యాక్స్ సిబ్బందికి టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.



Next Story

Most Viewed