‘ఆపరేషన్‌ ధూల్‌పేట్‌’ ఎఫెక్ట్.. కిలోల్లో గంజాయి అమ్మకాలు

by Rani Yarlagadda |
‘ఆపరేషన్‌ ధూల్‌పేట్‌’ ఎఫెక్ట్.. కిలోల్లో గంజాయి అమ్మకాలు
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: గంజాయి అమ్మకాలకు నెలవుగా మారిన ధూల్‌పేట్‌ పై ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరం చేసింది. ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ.కమలాస్ రెడ్డి ఆదేశాలతో అమ్మకాలను పూర్తిగా నిర్మూలించేందుకు గత జూలై నెల నుంచి ఆబ్కారిశాఖ మొదలుపెట్టిన ‘ఆపరేషన్‌ ధూల్‌పేట్‌’ విజయవంతంగా కొనసాగుతోంది. స్థానికంగా గంజాయి అమ్మకాలపై ఎక్సైజ్‌, ఎన్‌‌ఫోర్స్‌మెంట్‌ నిఘాపెట్టడం, నిందితులను పట్టుకొవడం, కోర్టుల చుట్టూ తిప్పిడం, గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు తీసుకుంటుండడంతో గంజాయి అమ్మకాలు దాదాపుగా నియంత్రణలోకి వచ్చాయి. క్వింటాళ్ల గంజాయి అమ్మకాల నుంచి కిలోల స్థాయికి అమ్మకాలు పడిపోగా అమ్మకందార్లు ధూల్‌పేట్‌ను విడిచి నగర శివారు ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.

గంజాయి నిర్మూలనపై అవగహన సదస్సు..

ధూల్‌పేట్‌ అపరేషన్‌లో భాగంగా దాదాపు నాలుగు నెలల నుంచి ఎక్సైజ్‌ ఎన్‌‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిషేధిత గంజాయి విక్రయాలు చేపడుతున్న వారితో పాటు కొనుగోలు చేస్తున్న వారిలో అవగాహన కల్పించేందుకు స్థానికంగా అధికారులు అవగాహనా సదస్సులు సైతం నిర్వహించారు. వీటిల్లో ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు గంజాయితో సంబంధం ఉన్న వారికి చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు గంజాయి అమ్మకాలు పూర్తిగా మానివేయాలని కోరారు. మళ్లీ అమ్మకాలు, కొనుగోలు చేపడితే మాత్రం 68 ఎఫ్/ఎన్‌డిపిఎస్‌ యాక్ట్‌ ద్వారా ఆస్తుల జప్తు, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనికి తోడు ఎక్సైజ్‌ ఎన్‌‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించడం సత్ఫలితాలను ఇస్తోంది.

218 మందిపై కేసులు.. పరారీలో 67 మంది..

ఆపరేషన్ ధూల్‌పేట్‌లో భాగంగా ఎక్సైజ్ ఎన్‌‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిత్యం దాడులు చేయడంతో నాలుగు నెలల వ్యవధిలో 61 కేసులలో 218 మంది గంజాయి విక్రేతలపై కేసులు నమోదు చేశారు. వీరిలో 40 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. 141 మందిని బైండోవర్ చేయగా 15 మందికి జరిమానా విధించారు. 128 కేసుల్లో చార్జీ‌షీట్‌ వేశారు. కేసులకు బయపడి మరో 67 మంది పరారయ్యారు. గత జూలై నుంచి ఆపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా 330 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 4.2 కేజీల హాష్‌ ఆయిల్‌‌తో పాటు 38 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

అమ్మకాలు పూర్తి నిలిపివేయాల్సిందే..

- వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌

ధూల్‌పేట్‌లో గంజాయి అమ్మకాలను పూర్తిస్థాయిలో నిలిపివేయాల్సిందే. నాడు నాటుసారా తయారీ, అమ్మకాలను నియంత్రించినట్లుగానే గంజాయి అమ్మకాలను కూడా పూర్తిగా నియంత్రించాలి. ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్‌ విషయంలో సీరియస్‌గా ఉంది. గంజాయి, డ్రగ్స్‌ విషయంలో ఎవ్వరిని ఉపేక్షించే పరిస్థితులు లేవు. గంజాయి, ఇతర మత్తుపదార్ధాల అమ్మకాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా ధూల్‌పేట్ వాసులు గంజాయి అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలి. ఇందుకోసం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed