Hyd: చీకోటిని ఏడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ

by srinivas |   ( Updated:2023-05-15 15:53:43.0  )
Hyd: చీకోటిని ఏడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: క్యాసినో కింగ్​చీకోటి ప్రవీణ్​కుమార్‌ను ఈడీ ప్రశ్నించింది. వేర్వేరు అంశాలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. థాయ్​లాండ్​దేశం పటాయాలో ఇటీవల అక్కడి పోలీసులు ఓ హోటల్‌లో నడుస్తున్న క్యాసినో సెంటర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే గేమింగ్​చిప్స్‌తోపాటు లక్షా అరవై అయిదువేల రూపాయల ఇండియన్​కరెన్సీని పటాయా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఓ లాగ్​బుక్‌ను సీజ్​చేశారు. దీనిని విశ్లేషించినపుడు అయిదు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల గ్యాంబ్లింగ్​జరిగినట్టుగా వెల్లడైంది. నగదు లావాదేవీలన్నీ ఇక్కడ మన దేశంలోనే హవాలా రూపంలో జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్​కుమార్‌, మెదక్​డీసీసీబీ ఛైర్మన్​చిట్టి దేవేందర్​రెడ్డి, మాధవరెడ్డితోపాటు మొత్తం 83మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం ఇక్కడ హైదరాబాద్‌లో కూడా కలకలం సృష్టించింది. హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్టు పటాయా పోలీసుల విచారణలో వెల్లడైన నేపథ్యంలో ఈడీ అధికారులు అలర్ట్​అయ్యారు. చీకోటిని ప్రశ్నంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేపాల్​క్యాసినోకు సంబంధించి నమోదు చేసిన కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని చీకోటికి నోటీస్​జారీ చేశారు. నోటీసులు అందుకున్న చోకోటి సోమవారం బషీర్​బాగ్​లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పటాయా క్యాసినోకు సంబంధించి ఈడీ అధికారులు చీకోటిని నిశితంగా ప్రశ్నించారు. ‘పట్టుబడటానికి ఎన్ని రోజుల ముందు పటాయా వెళ్లావు?, మిగితా భారతీయులు నీతోపాటే పటాయాకు వచ్చారా?, క్యాసినో నిర్వాహకులతో ఉన్న పరిచయాలు ఏమిటి?, అన్న అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం. పబ్లిక్​డొమైన్‌లో ఉన్న వివరాల ఆధారంగా ప్రశ్నలు సంధించటంతోపాటు లాగ్​బుక్​గురించి విచారించినట్టు తెలిసింది.

లగ్జరీ కార్లపై ఆరా...

ఇక చీకోటి వద్ద ఉన్న లగ్జరీ కార్లకు సంబంధించి కూడా ఈడీ అధికారులు విచారణ జరిపినట్టుగా తెలిసింది. నేపాల్​క్యాసినోకు సంబంధించిన కేసులో విచారణ జరుపుతున్నపుడు చీకోటి ఓ టెంట్​హౌస్​యజమాని పేర లగ్జరీ కారు కొన్న విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చీకోటి వద్ద ఎన్ని? ఏయే బ్రాండ్​కార్లు ఉన్నాయి? అన్నదానిపై ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలియవచ్చింది. సొంత పేరు మీద కొన్న కార్లు ఉన్నాయా? బినామీ పేర్లపై కొన్న కార్లు ఉన్నాయా? అని విచారించినట్టు సమాచారం. బంజారాహిల్స్​ప్రాంతంలో సెకండ్​హ్యాండ్​కార్ల వ్యాపారం చేస్తున్న నసీర్, మోసిన్‌లతో ఉన్న సంబంధాల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈడీ అధికారులు నసీర్, మోసిన్​లకు కూడా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే వీరిని కూడా విచారించనున్నట్టు సమాచారం.

అయితే, పోకర్​ టోర్నీ ఉందన్న ఆహ్వానం మేరకే తాను పటాయా వెళ్లినట్టు చీకోటి సమాధానం ఇచ్చినట్టు తెలియవచ్చింది. పోకర్​టోర్నీకి కూడా పటాయాలో అనుమతి ఉండదన్న విషయం తనకు తెలుసని చెప్పినట్టు సమాచారం. అయితే, తనకు ఆహ్వానం పంపించిన వారు దానిపై అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్టు స్టాంపులు వేసి పంపించారని తెలిపినట్టు సమాచారం. దాంతో తాను ఆ హోటల్‌కు వెళ్లానని తెలియచేసినట్టు తెలిసింది. తాను వెళ్లిన పది నిమిషాలకే పటాయా పోలీసులు దాడి చేసి అందరినీ పట్టుకున్నారని వివరించినట్టు సమాచారం. తాను క్యాసినోను నిర్వహించలేదని చీకోటి చెప్పినట్టుగా తెలిసింది. ఈ విషయాన్ని నిర్ధారించుకున్న తరువాతే పటాయా కోర్టు తనకు జరిమానా విధించి వదిలిపెట్టిందని చెప్పినట్టుగా సమాచారం.

Advertisement

Next Story