నగర శివారు రోడ్లకు మహర్దశ.. రూ.1,499 కోట్లతో మూడు ప్యాకేజీల్లో అభివృద్ధి పనులు..!

by Satheesh |
నగర శివారు రోడ్లకు మహర్దశ.. రూ.1,499 కోట్లతో మూడు ప్యాకేజీల్లో అభివృద్ధి పనులు..!
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోకి రాని శివారు ప్రాంతాల్లోని రోడ్లకు ఎట్టకేలకు మహర్ధశ పట్టనుంది. శివారు ప్రాంతాల్లోని రోడ్లను మూడు అంశాల ప్రాతిపదికన మూడు ప్యాకేజీల్లో ఈ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), శివారు మున్సిపల్ కార్పొరేషన్ల నిధులతో ఈ పనులు చేపట్టాలని సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. శివారు ప్రాంతాల రోడ్ల అనుసంధానం, అభివృద్ధి, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మెరుగుపరచాలని మూడు అంశాల ప్రాతిపదికన ఈ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు సంబంధించి ఈనెల 20వ తేదీ నుంచి టెండర్లను ఆహ్వానించి, నెల రోజుల అభివృద్ధిలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించే ఆలోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం.

శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, నాగారం, బండ్లగూడ జాగిర్, పోచారం, బడంగ్‌పేట్ ప్రాంతాల్లో ఎంపిక చేసిన రహదారులను రూ.698.20 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే బడంగ్‌పేట్, జవహర్‌నగర్, నాగారం, దమ్మయిగూడ, శంషాబాద్, కొత్తూరు ప్రాంతాలలో ఎంపిక చేసిన రోడ్లను రూ.801.80 కోట్లతో అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ పనులకు సంబంధించి హెచ్ఎండీఏ త్వరలోనే టెండర్లను చేపట్టి పనులు చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ పనులను చేపట్టే స్థానిక సంస్థ సగం శాతం ఖర్చులు భరించాల్సి ఉండగా మిగిలిన సగం శాతం హెచ్ఎండీఏ భరించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed