బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కులవృత్తులు నిర్వీర్యం : కిషన్ రెడ్డి

by Vinod kumar |
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కులవృత్తులు నిర్వీర్యం : కిషన్ రెడ్డి
X

దిశ, వనస్థలిపురం: చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గం ఆటోనగర్ సమీపంలోని కర్నాటి ఫంక్షన్ హాల్‌లో బీజేపీ నాయకులు కటికం నర్సింగరావు బొమ్మ రఘురాం నేత ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కులవృత్తులకు గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కుల వృత్తులను ఆదుకునే విధంగా బ్యాంకుల ద్వారా ముద్ర లోన్‌లు అందిస్తూ వారికి చేయూతగా నిలిచిందని తెలిపారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను వారంలో ఒక్కసారైనా ధరించి వారికి ఆసరాగా నిలవాలని ప్రధానమంత్రి మోడీ సూచించినట్లు పేర్కొన్నారు. గతంలో చేనేత వస్త్రాలకు వాడే నూలు మీద 5 శాతం సబ్సిడీ ఉండేదని ప్రధానమంత్రి దాన్ని 15% పెంచి వారికి బాసటగా నిలిచారని అన్నారు. మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ప్రజలు చేనేత రంగం మీదనే ఆధారపడి ఉన్నారని, ప్రభుత్వ ప్రోత్సాహం లేక వారి స్థితిగతుల్లో ఎటువంటి ఎదుగుదల లేక ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.

ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పరిహారం చెల్లించడం పరిష్కారం కాదని, ఆత్మహత్యలను నిలువరించే విధంగా ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు. చేనేత వస్త్ర సంస్థను ప్రోత్సహించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అనేక కార్యక్రమాలు చేపడుతుందని గుర్తు చేశారు. చేనేత కార్మికులు బలోపేతం కావడానికి అనేక కార్మిక సంఘాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే సంఘాలను నిర్వీర్య పరిచే విధంగా ఎన్నికలను నిర్వహించట్లేదని పేర్కొన్నారు. రానున్న నాలుగు నెలలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘాలను పటిష్ట పరిచే విధంగా ఎన్నికలను నిర్వహించి సంస్థల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్ర కార్మికులకు చేయూత నిచ్చే విధంగా రైల్వే శాఖల తో పాటు కేంద్ర ప్రభుత్వం మార్గ నిర్దేశంతో నడిచే హాస్టల్‌లో ఆసుపత్రులలో వాడి బెడ్ షీట్లను వినియోగించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు సామ రంగారెడ్డి, చేనేత సెల్ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు బొమ్మ రఘురాం నేత, ఖడ్గం నర్సింగరావు, కర్నాటి మాధవి బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed