ఓటరు.. మేలుకో

by Disha Web Desk 12 |
ఓటరు.. మేలుకో
X

దిశ, సిటీబ్యూరో: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ వంటి మహానగరాల్లో పోలింగ్ శాతం కేవలం 45 శాతం మాత్రమే నమోదు కావటాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. విద్యావంతులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ మహానగరాల్లో కాలక్రమేణా ఓటింగ్ శాతం తగ్గడం ప్రజాస్వామ్య పరంగా మంచి పరిణామం కాదన్న విషయాన్ని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 45 శాతానికి అధికంగా పది శాతమైన పోలింగ్ శాతం పెరగాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించిన నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, ఓటర్లలో ఓటుకు ఉన్న విలువపై అవగాహన పెంచేందుకు, ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు పలు రకాల కార్యక్రమాలను చేపట్టింది.

ఇందుకు స్వీప్ కార్యక్రమాల పేరిట ప్రత్యేకంగా ఓ విభాగాన్నే ఏర్పాటు చేసింది. ఓటరు మహాశయులను మేలుకొల్పేందుకే ఓటరు మహాశయా మేల్కొ..పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఓటరు ఎందుకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపటం లేదని విషయాన్ని విశ్లేషించుకున్న ఎన్నికల సంఘం ఎక్కువ మంది ఓట్లు వేసేందుకు ముందుకు వచ్చేలా చేయాల్సిన ఏర్పాట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే ఓటర్లను ఎండలో నిలబెట్టకుండా షామియానాలు, టెంట్లను ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్‌లో కరెంటు, మంచినీటి సరఫరా, టాయిలెట్లు వంటి మౌలిక వసతులను మస్టు చేశారు. ఎంపిక ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పోలింగ్ స్టేషన్లు ప్రస్తుతమున్న మౌలిక వసతుల స్థితిగతులతో పాటు చేపట్టాల్సిన పనులపై జిల్లా ఎన్నికల అధికారి నగరంలోని రిటర్నింగ్ ఆఫీసర్ల నుంచి క్షేత్రస్థాయి పరిశీలన జాబితాను తెప్పించుకుని ఇప్పటి వరకు దాదాపు 80 శాతం వరకు పూర్తి చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా ఈసారి కొత్తగా నమోదైన దాదాపు 60 వేల మంది కొత్త ఓటర్లు ఎలా ఓటు వేయాలన్న అంశంపై ఇప్పటికే విద్యాలయాల్లో, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి తోడు అనారోగ్యం గానీ, శరీరం సహకరించని 80 ప్లస్ వయస్సున్న వారికి ఇంట్లోనే ఓటింగ్ కంపార్ట్ మెంట్లను ఏర్పాటు చేసి ఓటు వేసేలా ప్రయత్నాలను చేస్తున్నారు. చాలా మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ ఉండటం, తాగునీరు అందుబాటులో ఉండకపోవటం, సమయం వృథా అవుతుందన్న భావనతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు గుర్తించిన ఎన్నికల సంఘం గూగుల్ ద్వారా ఓటరు తాను ఓటు వేయాల్సిన పోలింగ్ స్టేషన్ వద్ద క్యూను చూసుకునే వెసులుబాటును కూడా కల్పించారు. దీంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఓటర్ అసిస్టెన్స్ కౌంటర్‌ను తప్పకుండా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు.

స్వయం సహాయక బృందాలతో..

హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను ఈసారి జిల్లా ఎన్నికల యంత్రాంగం చక్కని మార్గాన్ని ఎంచుకుందనే చెప్పవచ్చు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక బృందాల సభ్యులతో తమ ఏరియాల్లో ఓటరు అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఈ బృందాల్లో సభ్యులుగా కొనసాగుతున్న మహిళలకు స్థానికంగా పరిచయాలు, చుట్టాలు, స్నేహితులు, వారి సామాజిక వర్గాలకు చెందిన సంస్థలు వ్యక్తులు ఉండటం, వారితో వీరికి ఎక్కువ చనువు ఉండటంతో ప్రచారానికి స్వయం సహాయక బృందాలతో ప్రచారం చేయిస్తున్నారు. వీరితో పాటు టౌన్ లెవెల్, స్లమ్ లెవేల్ ఫెడరేషన్లు, స్వచ్చంధ సంస్థలతో పాటు సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

అభ్యర్థులు ప్రచారం అయిన వెంటనే ఈ అవగాహన కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పలువురు సినీ సెలబ్రిటీలతో కూడా ఓటింగ్ పెంపునకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ యాస, భాషలో వచ్చిన సినిమాలతో పాపులర్ అయిన పలువురు హీరో, హీరోయిన్లను ఇప్పటికే ప్రచారం కోసం రావాలని సంప్రదించినట్లు సమాచారం. ఈ నెల చివరి నుంచి ఈ ప్రచారం కూడా ప్రారంభించేందుకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.



Next Story