Police Department : 30 రోజుల్లో 345 సెల్ ఫోన్లు రికవరీ..

by Sumithra |   ( Updated:2024-07-25 11:54:41.0  )
Police Department : 30 రోజుల్లో 345 సెల్ ఫోన్లు రికవరీ..
X

దిశ, శేరిలింగంపల్లి : సైబరాబాద్ పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన 345 సెల్ ఫోన్లను కేవలం 30 రోజుల్లోనే రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కె.నరసింహ పర్యవేక్షణలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా ఐటీ సెల్ అండ్ సోషల్ టీమ్ 30 రోజుల్లో 345 మొబైల్ ఫోన్లను విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను గురువారం సైబరాబాద్ కమిషనరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్ లో క్రైమ్స్ డీసీపీ కె.నరసింహ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా క్రైమ్స్ డీసీపీ కె.నరసింహ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు మన దైనందిన జీవితంలో చాలా కీలకమని, ఎన్నో ముఖ్యమైన సమాచారం, జ్ఞాపకాలను కలిగి ఉంటాయని అన్నారు. దొంగలు ఎక్కడైనా ఉండవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

అలాగే రికవరీ ప్రయత్నాలలో పోలీసులు పట్టుదలగా ఉండాలని ఆయన సూచించారు. చాలా మంది విద్యావంతులైనప్పటికీ దొంగిలించిన మొబైల్స్ దుర్వినియోగం కాకుండా ఎలా నిరోధించాలో కొద్దిమందికి మాత్రమే తెలుసన్నారు. ఎన్సీఆర్పీ పోర్టల్, సీఈఐఆర్ పోర్టల్ లేదా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 1930 జాతీయ హెల్ప్ లైన్ డెస్క్ కు డయల్ చేయడం ద్వారా కోల్పోయిన మొబైల్ వివరాలను నివేదించాలని డీసీపీ ప్రజలకు సూచించారు. సెల్ ఫోన్లను విజయవంతంగా స్వాధీనం చేసుకున్న క్రైమ్స్ ఏసీపీ కళింగరావు, ఐటీ సెల్ ఇన్ స్పెక్టర్ జగదీశ్వర్, ఐటీ సెల్ బృందాన్ని క్రైమ్స్ డీసీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed