జీహెచ్ఎంసీలో 30 శాతం కమీషన్ పక్కా!

by Anjali |
జీహెచ్ఎంసీలో 30 శాతం కమీషన్ పక్కా!
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్టు పాలన తయారైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల జీతభత్యాలు, ఎరియర్స్, మెడికల్ రియింబర్స్‌మెంట్, సప్లిమెంటరీ చెల్లింపుల కన్నా, కాంట్రాక్టర్ల బిల్లులు ఏమాత్రం ఆలస్యం కాకుండా చేయటానికే సిబ్బంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆడిటర్, జోనల్ కమిషనర్ల పీఏలు, అసిస్టెంట్ ఆడిటర్స్ మరికొందరు కలిపి జోనల్ స్థాయిలో సిండికెట్‌గా మారి కమీషన్ల దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

జీహఎచ్ఎంసీలోని పర్మినెంట్ ఉద్యోగులు, ఔట్‌సోర్స్ కార్మికులకు సకాలంలో జీతాలు అందేందుకు వీలుగా ప్రతి నెల 21 నుంచి వారం రోజుల్లోగా జీతాలకు సంబంధించిన బిల్లులు పెట్టాలని నేరుగా ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలున్నా, వాటిని పక్కనబెట్టి జోనల్‌స్థాయిలో సిండికెట్లు కాంట్రాక్టర్ల బిల్లులకే ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. ఒక్కో కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లులో 30 శాతం కమీషన్‌గా కుదుర్చుకుని, ఉద్యోగులు, కార్మికుల పనిని పక్కనబెట్టి, మరీ కాంట్రాక్టర్లకు పనులను ముందుగా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి వ్యవహారాలు నగరంలోని దాదాపు అన్ని జోన్లలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఓ మహిళాధికారికి, ఓ యూనియన్ నేతకు గతంలో వివాదం కూడా చోటు చేసుకుంది.

ఔట్‌సోర్స్‌కు ఇంత ప్రాధాన్యమా?

ఒక జోన్‌లోని ఏపనికి సంబంధించైనా బిల్లుల చెల్లింపులను చూసేందుకు జోనల్ కమిషనర్లు ఔట్‌సోర్స్ కింద ఓ ఉద్యోగిని నియమించి, ఆడిటర్స్, అసిస్టెంట్ ఆడిటర్స్‌తో సిండికెట్ చేస్తూ, బిల్లుల చెల్లింపుల తర్వాత వసూలు చేసే 30 శాతం కమీషన్‌లో జోనల్ కమిషనర్ వాటాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు డిప్యూటీ కమిషనర్లు కూడా తమ పరిధిలో ఉన్న ఓ ఉద్యోగిని ఈ సిండికెట్‌లో చేర్చి, తమకు రావాల్సిన వాటాను వసూలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యవహరానికి సంబంధించి సికింద్రాబాద్‌లో 12 ఏళ్లుగా తిష్టవేసిన ఓ మహిళా అధికారి గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.

జోనల్ కమిషనర్ పీఏ ఔట్‌సోర్స్ ఉద్యోగే అయినా పర్మినెంట్ ఉద్యోగి అయిన సదరు అధికారి పీఏ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక కూకట్‌పల్లి జోన్‌లోనైతే వసూళ్ల వ్యవహరాలు చూసుకునేందుకు ప్రయివేటు వ్యక్తులను నియమించుకున్నట్లు ఆరోపణలున్నాయి. కమిషనర్ ఇటీవల చేసిన సూపరింటెండెంట్ ట్రాన్స్‌ఫర్లలో భాగంగా సదరు అధికారికి ఈ బదిలీని మినహాయించేందుకు జోనల్ కమిషనర్ చక్రం తిప్పినట్లు చర్చ జరుగుతుంది.

మెడికల్ ఆఫీసర్లకు ఎస్ఎఫ్ఏలే ఏజెంట్లు..

నగరంలోని 30 సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్లలో ఎక్కువ మంది తమ లంచాల వసూళ్ల కోసం ఎస్ఎఫ్ఏలను వినియోగించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. శానిటేషన్ గ్రూప్‌ల మామూళ్లు, డమ్మీల జీతాల క్లెయిమ్, ఖాళీ పోస్టు భర్తీ వంటి వ్యవహారాలు చూడటంతో పాటు మెడికల్ ఆఫీసర్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ల ఇళ్లలోని అవసరాలను కూడా ఈ ఎస్ఎఫ్ఏలే చూస్తుంటారన్న ఆరోపణల్లేకపోలేవు. మెడికల్ ఆఫీసర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ల అండతో రెచ్చిపోయిన ఎస్ఎఫ్ఏలను అధికారులు యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉపయోగించుకున్నట్లు పలు ఘటనలు రుజువు చేసినా, ఇంకా ఎస్ఎఫ్ఏల పనితీరులో మార్పు రాలేదని వారి బాధితులు వాపోయారు.

Advertisement

Next Story