జీహెచ్ఎంసీలో రాజ్యమేలుతున్న అవినీతి, నిర్లక్ష్యం!

by Anjali |   ( Updated:2023-05-14 02:52:32.0  )
జీహెచ్ఎంసీలో రాజ్యమేలుతున్న అవినీతి, నిర్లక్ష్యం!
X

దిశ, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో అవినీతి, నిర్లక్ష్యం రాజ్యేమేలుతున్నాయి. బల్దియా సిబ్బంది, అధికారుల పనితీరు కేవలం ఆయా..ఖాయా..పీయా..చల్దియా అన్నట్టు తయారైందనే విమర్శలు ఉన్నాయి. ఏచిన్న పనికైనా సందర్శకులనే గాక, సాక్ష్యాత్తు జీహెచ్ఎంసీ ఉద్యోగులను సైతం ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరవాసులు, సందర్శకుల ఫిర్యాదుల పరిష్కారంతో పాటు కార్పొరేటర్ల అభివృద్ధి ప్రతిపాదనలకు సైతం ఏళ్లతరబడి తిప్పుకుంటున్నట్లు పలువురు ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఎప్పటికప్పుడు ఫైళ్లను క్లియరెన్స్ చేసుకునే దిశగా కామాటి మొదలుకుని కమిషనర్ వరకు విధులు నిర్వహించటం లేదన్న ఆరోపణలున్నాయి.

పడకేసిన పరిపాలన..

రెండు రోజులుగా కమిషనర్ అందుబాటులో లేకపోవటంతో పాటు మొత్తం పరిపాలన వ్యవహారాన్ని చూసుకునే అదనపు కమిషనర్ సైతం తరుచూ లీవ్‌లో వెళ్తుండటంతో సాధారణ పరిపాలన మొత్తం పడకేసినట్టయింది. ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రియింబర్స్‌మెంట్లు, జీపీఎఫ్, హౌజ్‌లోన్లు వంటి ప్రయోజనాల కోసం సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు నెలల తరబడి ప్రధాన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక కారుణ్య నియామకాలకు సంబంధించి ఓ ప్రత్యేక దందానే కొనసాగుతున్నట్లు పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. సర్కిల్ స్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా సర్వీసు ఉన్నా, రిటైర్డు అయిన ఉద్యోగులను తిరిగి నియమించుకునేందుకు కమిషనర్ వద్ద పైరవీలు చేసుకున్నా, నేటికీ ఫలించలేదంటే జీహెచ్ఎంసీ ఉద్యోగుల పనితీరు ఏపాటిదో అంచనా వేసుకోవచ్చు.

మేయర్ అక్షింతలు వేసినా మారని తీరు..

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవం కార్యక్రమానికి అన్ని సర్కిళ్లు, జోన్ల సిబ్బంది, అధికారులకు ఆహ్వానపత్రాలను పంపిన అదనపు కమిషనర్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. సదరు అధికారి అధ్యక్షతన జరగాల్సిన ఈ కార్యక్రమానికి ఆమె హాజరుకాకపోవటంతో మేయర్ విజయలక్ష్మి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అక్షింతలు వేసినట్లు సమాచారం. అయినా అప్పటి నుంచి ఆమె పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదన్న వాదనలున్నాయి. ప్రస్తుతం కూడా ఆమె సెలవుల్లో ఉన్నట్టు సమాచారం. పరిపాలన వ్యవహారాలకు సంబంధించి అనేక ఫైళ్లు ఆమె వద్దనే పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed