ఐటీ, ఏఐ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో ఉంది : మంత్రి శ్రీధర్ బాబు

by M.Rajitha |
ఐటీ, ఏఐ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ ప్రపంచంలోని పలు దేశాలతో పోటీ పడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం ఎగుమతులు రూ.1,16,182 కోట్లు కాగా ఇందులో రూ.36,893 కోట్లు ఫార్మా ఎగుమతులేనని అన్నారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మూడు వారాల శిక్షణ ముగించుకున్న ఈజిప్టు ‘వాణిజ్య దౌత్యవేత్తల’ బృందంతో సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలోని అత్యాధునిక వైద్య సంస్థలతో హెల్త్ టూరిజం కూడా విస్తరిస్తోందన్నారు. ఈజిప్టు, హైదరాబాద్ కు సాంస్కృతిక పరంగా అనేక సారూప్యాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని 67,000 మంది స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ మహిళల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 119 ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. స్వయం సహాయక బృందాల మహిళల ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయని, కొన్ని కళాఖండాలు, వస్త్రాలు విదేశాలకు కూడా వెళ్తున్నాయన్నారు. ఐటీ, కృత్రిమ మేథ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా వృద్ధి చెందుతోందని వెల్లడించారు. సెమీ కండక్టర్ల తయారీకి తెలంగాణ చిరునామాగా మారబోతోందని అన్నారు. సమావేశంలో ఎంసీహెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ గోయెల్, కోర్సు డైరెక్టర్ మాలతీ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed