- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: హైదరాబాద్ బీఆర్ఎస్‌లో కల్లోలం.. మంత్రి తలసానిపై కీలక నేతల తిరుగుబావుటా..?
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ జిల్లాలో మరోసారి బహిర్గతం అయ్యాయి. మంత్రి తలసానిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఆత్మీయ సమ్మేళనాలను ముందుండి నిర్వహించాల్సిన జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది.
సమావేశానికి రావాలని మేసేజ్‌లు, ఫోన్ చేయడం.. అన్నితానై తలసాని వ్యవహరించడం, ఆధిపత్యం ఎక్కువకావడంతోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి దూరమైనట్లు పార్టీ నేతలే బహిరంగంగా పేర్కొంటున్నారు. మంత్రి మంత్రిగా వ్యవహరించాలే కానీ పెత్తనం ఏందని మండిపడుతున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలోనే నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని మూడోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నామని సీఎం పేర్కొంటున్నప్పటికీ సాధ్యం కావడం లేదు. కేడర్, నేతల మధ్య సమన్వయం కోసం చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలతో విబేధాలు, గ్రూపులు, ఆధిపత్య పోరు స్పష్టంగా బహిర్గతమవుతోంది. పార్టీ మాత్రం పార్టీ కార్యక్రమాల సమన్వయానికి ఇన్ ఇన్ చార్జీని నియమించినప్పటికీ నేతలు ఏకతాటిపైకి రావడం లేదు. కొన్ని జిల్లాల్లో మంత్రుల ఆధిపత్యం ఉండటంతో సొంతపార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారు.
తెలంగాణ భవన్‌లో మంగళవారం హైదరాబాద్ జిల్లా ఆత్మీయ సమ్మేళనాన్ని జిల్లా ఇన్ చార్జీ దాసోజు శ్రవణ్ ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ సమ్మేళనంలో గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు బహిర్గతమైంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందులో 7 ఎంఐఎం, ఒకటి బీజేపీ(గోషామహల్), మిగిలిన 7స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.
బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గెలిచిన సాయన్న మృతి చెందగా, ముషీరాబాద్ నుంచి ముఠాగోపాల్, అంబర్ పేట - కాలేరు వెంకటేశ్, ఖైరతాబాద్- దానం నాగేందర్, జూబ్లీహిల్స్-మాగంటి గోపీనాథ్, సనత్ నగర్ - తలసానిశ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ -పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆత్మీయ సమ్మేళనానికి ఇద్దరు ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, దానం నాగేందర్ మాత్రమే హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ వాణిదేవి కూడా రాలేదు. పార్టీ కేడర్ వచ్చినప్పటికీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గైర్హాజర్ కావడంతో పార్టీలో చర్చనీయాంశమైంది.
ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షుడే గైర్హాజర్
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరు కాలేదు. బీఆర్ఎస్‌లో పార్టీ అధ్యక్షుడికి కీలక బాధ్యతలను పార్టీ అప్పగించినప్పటికీ రాలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఉన్న విభేదాల కారణంగానే రాలేదనే చర్చ సాగుతోంది. తలసాని మంత్రిగా కాకుండా జిల్లాపై ఆధిపత్యం చెలాయిస్తుండటం, జిల్లా అధ్యక్షుడిపై సైతం పెత్తనం చెలాయిస్తుండటంతోనే అసంతృప్తితోనే గోపీనాథ్ రాలేదనే ప్రచారం జరుగుతుంది.
అధ్యక్షుడికి సమావేశాల్లోనూ ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని, అన్నీతానై తలసాని వ్యవహరిస్తుండటంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు కార్యక్రమాలు పేర్కొంటున్నారు. జిల్లా అధ్యక్షుడి అనుమతితో కాకుండా ఆత్మీయ సమ్మేళనాలకు రావాలని మంత్రి తలసాని పార్టీ నేతలకు, కార్యకర్తలకు మెసేజ్‌లు పంపడం, ఫోన్లు చేయడంతో ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలను తలసాని ప్రోత్సహిస్తున్నాడనే కారణంతోనే రాలేదనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. జిల్లా అధ్యక్ష పదవి నామ్ కే వాస్తేగా మారిందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
పద్మారావు అసంతృప్తి..?
గత కొంతకాలంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం పోరు సాగుతోంది. బీఆర్ఎస్ లో తలసాని కంటే సీనియర్ పద్మారావు. అయినప్పటికీ తలసాని మాత్రం పద్మారావును చాలాకాలంగా డామినేట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. తలసాని వ్యవహారంతో పద్మారావు అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది.
పార్టీలో తన మాటే చెల్లుబాటు అయ్యేలా తలసాని వ్యవహరిస్తున్నాడని, అందుకే తలసాని పాల్గొనే సమావేశాలు, పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారని నేతలు పేర్కొంటున్నారు. అందులో భాగంగానే జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి పద్మారావు రాలేదని టాక్. ముషీరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఠాగోపాల్ మాత్రం అనారోగ్య కారణాలతో రాలేదని సమాచారం.
రెండోసారి గైర్హాజర్..
ఆత్మీయ సమ్మేళనాల విజయవంతానికి ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో హైదరాబాద్ జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సైతం జిల్లా అధ్యక్షుడు గోపీనాధ్, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, పద్మారావు, ఎమ్మెల్సీ వాణిదేవి హాజరు కాలేదు. సమ్మేళనాలను విజయవంతం చేయాలని షెడ్యూల్ రూపొందించేందుకు సైతం రాలేదు. మంగళవారం నిర్వహించిన జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి సైతం రాకపోవడంతో పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలతోనే సమ్మేళనానికి దూరంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్‌పై ఆధిపత్యం కోసం తలసాని గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, జిల్లాపై తనముద్ర వేసుకోవాలని భావిస్తుండటంతో దీనిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల ఇన్ చార్జీ సైతం ఉన్నప్పటికీ అన్నీ తానై వ్యవహరిస్తుండటం, అందరిని కలుపుకపోవడంతోనే తలసానిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇలాగే గ్రూపు రాజకీయాలు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై అధిష్టానం సైతం ఎలా స్పందిస్తుందో చూడాలి.
గ్రూపు రాజకీయాలు వద్దు: మేయర్ విజయలక్ష్మి
ఆత్మీయ సమ్మేళనానికి చాలా మంది సీనియర్ నేతలకు సైతం ఆహ్వానం అందలేదని మేయర్ విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. మొదటినుంచి పార్టీకోసం పనిచేస్తున్నారని వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమన్నారు. పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని, సమస్యలు పరిష్కారం కావడం లేదని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నారని వాటిని పరిష్కరించాలన్నారు. మనంమనం తిట్టుకోవద్దని సూచించారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు వద్దని హితవు పలికారు.
ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి కీలకమన్నారు. ఒక్కో కార్యకర్త 10 మందిని తయారు చేస్తారని, ఓట్లు సైతం వేయిస్తారన్నారు. అందరిని ఏకతాటిపైకి తీసుకురావల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. పార్టీలో అందరికీ ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. దీనికి మంత్రి తలసాని స్పందిస్తూ.. డివిజన్ల వారీగా నేతలందరికీ వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇచ్చామని, తన కార్యాలయం నుంచే పంపించామని, కొందరికి ఫోన్లు కూడా చేశానన్నారు.