HYD : కారుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బీభత్సం.. వ్యక్తి మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2024-04-16 02:31:09.0  )
HYD : కారుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బీభత్సం.. వ్యక్తి మృతి
X

దిశ, శేరిలింగంపల్లి : ఐటీ కారిడార్ పరిధిలో మద్యం మత్తులో ఓ ఐటీ ఉద్యోగి కారుతో భీభత్సం సృష్టించాడు. మితిమీరిన వేగంతో రహదారి మీద కనిపించిన వాహనాన్ని కనిపించినట్లు ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. దాదాపు అర్థగంట పాటు హైటెక్ సిటీ రహదారుల మీద వీరంగం సృష్టించిన కారు మొత్తం 4 ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణమైంది. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసిన ఐటీ ఉద్యోగి రాష్ డ్రైవింగ్ కారణంగా 9 మంది గాయపడగా, అందులో గుర్తు తెలియని పాదచారి మృతిచెందాడు.

రాయదుర్గం పోలీస్ స్టేషన్ వరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు... నిజాంపేటలో నివాసం ఉంటూ ఐటి కంపెనీలో పనిచేస్తున్న క్రాంతికుమార్(30) రాత్రి పీకలదాక మద్యం సేవించాడు. అనంతరం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో తన వోక్స్ వ్యాగన్ పోలో కారును తీసుకొని హైటెక్ సిటీ రహదారిపై మితిమీరిన వేగంతో నడుపుతూ.. అడ్డువచ్చిన వాహనాలను ఢీకొడుతూ అర్థరాత్రి 12.30 నుంచి 1గంట వరకు అర్థగంట పాటు రహదారిపై వీరంగం సృష్టించాడు. మొదట మైండ్ స్పేస్ చౌరస్తా సమీపంలోని ఐకియా వద్ద ఓ కారును ఢీకొట్టిన క్రాంతికుమార్ తన కారును ఆపకుండా వెళ్లాడు.

అక్కడి నుంచి శిల్పా ఫ్లైఓవర్ మీద వేగంగా ప్రయాణించగా, కారు అదుపుతప్పి ముందున్న మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. వెంటనే అక్కడి నుంచి కారుతో పరారైన క్రాంతికుమార్ గచ్చిబౌలి మీదుగా బయోడైవర్సిటీ జంక్షన్ వైపు కారును మళ్లించాడు. ఈ క్రమంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ సమీపంలోని ఫిస్తా హౌజ్ ముందు రహదారిపై వెళ్తున్న పాదచారుడిని క్రాంతికుమార్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని పాదచారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి రాయదుర్గం మల్కం చెరువు వద్ద ఓ ఆటోను ఈ కారు ఢీకొట్టింది.

అర్ధగంట పాటు కారు చేసిన బీభత్సం కారణంగా నాలుగు ప్రమాదాలు చోటుచేసుకోగా, మొత్తం 9 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గుర్తు తెలియని పాదచారుడు మృతిచెందాడు. ఈ ప్రమాదాల్లో ఓ కారు, మూడు ద్విచక్రవాహనాలు, ఓ ఆటో దెబ్బతున్నాయి. కాగా మల్కం చెరువు ప్రమాదం అనంతరం క్రాంతికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా రీడింగ్ 550 వచ్చిందని తెలిసింది.

Advertisement

Next Story