Amaravathi: రాజధానిపై వైసీపీ డైలమా..? ఆ మౌనానికి కారణమేమి?

by Anil Sikha |   ( Updated:2025-04-29 12:39:29.0  )
Amaravathi: రాజధానిపై వైసీపీ డైలమా..? ఆ మౌనానికి కారణమేమి?
X

వైసీపీ స్టాండ్ ఏమిటని రాజకీయ వర్గాల్లో చర్చ

మూడు రోజుల్లో అమరావతి పనులు పునః ప్రారంభం

కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోడీ

అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం

దిశ, డైనమిక్ బ్యూరో : అమరావతి రాజధానిపై వైసీపీ మౌనం వహించింది..మరో మూడు రోజుల్లో రాజధాని (Amaravati ) నిర్మాణ పనులు పున: ప్రారంభం కానున్నాయి. మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narandra Modi) ప్రారంభించనున్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాటు చేస్తుంది. నిర్మాణ పనుల ప్రారంభానికి గుర్తుగా ఓ పైలాన్ ను కూడా ఏర్పాటు చేసింది. దానిని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ దశలో అమరావతిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ స్టాండ్ ఏమిటనేది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన వైసీపీ రాజధాని అంశంపై పునః సమీక్ష చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట శాసనమండలిలో వైసీపీ సభా పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు తాము పార్టీలో చర్చించుకుని చెబుతామన్నారు. దీంతో రాబోయే రోజుల్లో అమరావతి ఏకైక రాజధాని అని వైసీపీ స్పష్టం చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.

మూడు రాజధానులతో తీవ్ర వ్యతిరేకత

2019 లో అధికారంలోకి రాగానే వైసీపీ మూడు రాజధానులు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్రంగా పనిచేసింది. తెలుగుదేశం (TDP) పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకే మాటపై నిలబడింది. అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అంటూ సుస్పష్టం చేసింది. వైసీపీ (YCP) ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి తమ మద్దతని ప్రకటించింది. అధికారంలోకి రాగానే అమరావతిని మూలన పడేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు రాజధానుల పేరిట ప్రజల తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుందనే వాదన ఉంది. వైసీపీ ఘోర ఓటమికి ఇది కూడా ముఖ్య కారణంగా విశ్లేషకులు చెబుతుంటారు.

చకచకా అడుగులు

ఇక మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ (BJP) కూడా అధికారంలో భాగస్వామి కావడంతో అనుకున్న విధంగానే నిధులు సమకూరుతున్నాయి. న్యాయపరమైన చిక్కులను దాటుకుని, అమరావతిని పునర్నిర్మించేందుకు కూటమి చకచకా అడుగులు వేసింది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది. రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో అమరావతి రాజధానిగా అనుకున్నప్పుడు ఉద్దండరాయుని పాలెంలో మోడీనే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్లీ ఆయననే పిలిచి పనులను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ పరిణామాలు అన్నిటిని వైసీపీ నిశితంగా గమనిస్తోంది. పార్టీ అధినేత, కింది స్థాయి నాయకులు సైతం ఎక్కడ అమరావతి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. దీంతో వారు కూడా రానున్న రోజుల్లో అమరావతి కే ఓటు వేస్తారని వాదన వినిపిస్తోంది



Next Story