‘జూపల్లి’ బలమెంత? ఆయన చేరిక ఏ పార్టీకి లాభం

by Sathputhe Rajesh |
‘జూపల్లి’ బలమెంత? ఆయన చేరిక ఏ పార్టీకి లాభం
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : అధికార బీఆర్ఎస్ పార్టీని వీడిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బలం, బలగాన్ని రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నాయి. ఆయనతో కలిసి నడిచేదెవరు.. కలిసినా ఎంతమంది.. అందులో ఏ స్థాయి నాయకులున్నారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నాయి. ఆయన చేరికతో ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి కలిసి వస్తుంది.. ఆయన చేరికను ఇతర పార్టీల నాయకులు స్వాగతిస్తారా అనే కోణంలో ప్రత్యేకంగా తెలుసుకుంటున్నాయి.

కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జూపల్లి కృష్ణారావు సమైక్యాంధ్ర ప్రభుత్వాలలోనూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం 2018లో ఓటమిపాలైన తర్వాత .. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడంతో.. జూపల్లికి ప్రాధాన్యం తగ్గింది.. దీంతో ఆయన అధికార పార్టీతో అంటి ముట్టనట్లుగానే ఉంటూనే.. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ ఎమ్మెల్యేతో కలిసి పనిచేయలేక.. తన క్యాడర్‌ను దెబ్బ తీసుకోలేక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో దించారు. పలువురిని గెలిపించుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు.

ప్రజలను కలవడానికే ఆసక్తి

జూపల్లి కృష్ణారావు 2018 సంవత్సరం ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత ఏం మాత్రం నిర్లక్ష్యం చేయకుండా.. ప్రజలలో కలిసి ఉండడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. అధికార పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటిని లెక్కచేయకుండా.. ప్రజలను కలుస్తూ.. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయాలలో ప్రజలలో కలవడానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వని జూపల్లి.. ఓటమిపాలైన తర్వాత మరింత కసిగా ప్రజలలో మమేకం కావడానికి ప్రాధాన్యం ఇచ్చారు.

సాగునీరు, తాగునీరు, స్థానిక సమస్యలు తదితర అంశాలపై పార్టీలో ఉంటూనే.. ప్రజాప్రతినిధులు, అధికారులపై విమర్శల వర్షం కుప్పిస్తూ వచ్చారు. తన వర్గంపై పోలీసులు కేసులు నమోదు చేస్తే వాటి గురించి ఎప్పటికప్పుడు పోలీసులను నిలదీస్తూ.. తన క్యాడర్‌కు ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. ఈ కారణంగా ఆయనకు నియోజకవర్గంలో దాదాపుగా 100 మంది కి పైగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అండగా ఉన్నారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు సైతం జూపల్లి వెంట ఉన్నారు. వారందరి సహకారంతో అధికార పార్టీ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలలోకి తీసుకువచ్చారు. ప్రజలలో ఉన్న ఆదరణను పోకుండా మరింత పెంచుకోవడంలో సక్సెస్ అయ్యారు. అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తనకు బలంగా ఉన్నారు.

ముఖ్య నాయకులు, కార్యకర్తలు జూపల్లి అనుచరులు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడక్కడ ముఖ్య నాయకులు, కార్యకర్తలు జూపల్లి అనుచరులుగా ఉన్నారు. అధికార పార్టీలో తగిన ప్రాధాన్యం లేకపోవడంతో జూపల్లి మార్గంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. వనపర్తి జిల్లాలో ఇటీవల అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి లలో ఒకరిద్దరూ జూపల్లి తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సైతం జూపల్లి మార్గాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. జూపల్లి అండదండలతో గెలుపొందిన ఓ ఎమ్మెల్యే పరిస్థితులను బట్టి ఆయన వెంట నడిచే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ పట్ల విరక్తితో ఉన్న పలువురు నేతలతో పాటు, తెలంగాణ సాధన కోసం ప్రధాన భూమికను పోషించి అధికార పార్టీలో తగిన ప్రాధాన్యం లేని ఉద్యమకారులు సైతం జూపల్లి బాట పట్టే అవకాశాలు ఉన్నాయి.

స్పష్టత ఇవ్వని జూపల్లి..

కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఏ పార్టీలో చేరాలనే అంశంపై జూపల్లి స్పష్టత ఇస్తారు అని అందరూ భావించారు. కానీ జూపల్లి విషయం బయటకు పొక్కకుండా.. ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలను తీసుకున్నారు. తెలంగాణ కోసం పోరాటాలు సాగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫొటోలు కూడా ఉన్నాయని చెప్పారు. దీని ద్వారా ఆయన అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మద్దతును కూడగట్టుకునేలా మాట్లాడారు.. ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై పరిస్థితులే నిర్ణయిస్తాయి అని చెప్పడం.. తాను ఏ పార్టీలో చేరేది చెప్పడానికి మరికొంత సమయం పడుతుందన్నట్లు చెప్పారు. ఏది ఏమైనా జూపల్లికి ఉన్న బలం, బలగాల కారణంగా రానున్న ఎన్నికలలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలలో ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాలను రాజకీయ మేధావులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story