వరి బోనస్‌.. పండగలా చేద్దాం : సర్కారు సమాలోచనలు

by M.Rajitha |
వరి బోనస్‌.. పండగలా చేద్దాం : సర్కారు సమాలోచనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ నుంచే రైతులకు వరి పంటకు క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది రైతులకు లబ్ధి కలుగుతుందనే లెక్కల్లో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ఈ సీజన్‌లో జిల్లాలవారీగా వరి సాగు విస్తీర్ణంపై వివరాలను సేకరించిన వ్యవసాయ విస్తరణాధికారులు తాజా వరదలతో ఎంత పంట నష్టం జరిగిందో కూడా అంచనా వేస్తున్నారు. నికరంగా సాగులో ఉన్న వరి విస్తీర్ణం లెక్కలను తేల్చి ఈసారి దిగుబడి ఎంత రావొచ్చనే స్పష్టతపై విశ్లేషణనలు మొదలు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు సన్న రకం వడ్లను విక్రయించగానే బోనస్ పేరుతో వారి ఖాతాల్లో డబ్బును జమ చేయాలని భావిస్తున్నది. దీన్ని ఒక పండుగలాగా నిర్వహించాలనే అభిప్రాయంతో ఉన్నది. రైతులకు నెల రోజుల వ్యవధిలోపే రెండు లక్షల పంట రుణాలను మాఫీ చేసిన అంశంతో పాటు బోనస్‌ను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నది.

మూడు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో వరి పంటకు బోనస్ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నందున రెండున్నర వేల కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేసింది. ఈ మేరకు కేటాయింపులు చేయడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. పంట కోతలు ప్రారంభమై ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు పంట రావడం మొదలయ్యే టైమ్‌కు ఫండ్స్ సిద్దం చేయడంపై ఫైనాన్స్ డిపార్టుమెంట్ దృష్టి పెట్టింది. ఒక్కో ఎకరానికి సగటున 20 క్వింటాళ్ళ మేర పంట దిగుబడి వస్తుందన్న అంచనాతో రైతులకు రైతు భరోసా పేరుతో వచ్చే నిధులతో పాటు బోనస్ రూపంలోనూ అదనంగా రూ.10 వేల చొప్పున అందుతాయన్న అంచనాలు రైతాంగంలో మొదలయ్యాయి. రైతులు సాగుచేస్తున్న విస్తీర్ణంలో సన్నాలు, దొడ్డు రకాలపై అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో సన్నాల దిగుబడి ఎంత ఉండొచ్చు.. వారికి బోనస్ రూపంలో ఎంత ఇవ్వాల్సి ఉంటుంది... రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులకు ప్రయోజనం కలగనున్నది... వీటిపై అంచనాలు మొదలయ్యాయి.

పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంచనా ప్రకారం ఈసారి ఖరీఫ్ సీజన్‌లో దాదాపు కోటిన్నర టన్నుల మేర వరి దిగుబడి ఉండొచ్చు. ఇందులో దాదాపు 80 లక్షల టన్నులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయం కోసం వస్తాయని, మిగిలినది రైతులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. లేదా ఇతర కారణాల రీత్యా మిల్లర్లకు అమ్ముకుంటారని ఆ శాఖ అధికారుల అంచనా. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే వడ్లకు మాత్రమే రూ. 500 బోనస్ వర్తించనున్నందున ఇందులో సన్న రకం వడ్లు ఎన్ని టన్నులుంటాయన్న లెక్కలపై స్పష్టత రావాల్సి ఉంది. వ్యవసాయ శాఖ ప్రాథమిక స్థాయిలో ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపు 50 లక్షల టన్నుల మేర సన్న రకం వడ్లు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని తేలింది. ఆ ప్రకారం ప్రభుత్వం కేటాయించనున్న రెండున్నర వేల కోట్ల రూపాయలు సరిపోవచ్చని అంచనా. మరికొన్ని రోజుల తర్వాత నిర్దిష్టమైన గణాంకాలు అందుబాటులోకి వస్తే అదనపు నిధులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత మిల్లింగ్ చేసి రేషను కార్డులకు జనవరి నెల నుంచి ఇవ్వనున్న సన్న బియ్యం కోసం కొంత కేటాయించాల్సి ఉంటుంది. ఇది దాదాపు 35 లక్షల టన్నులు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. మొదటిసారి సన్న వడ్లను రేషను దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నందున ఇప్పటివరకూ పంపిణీ అయిన దొడ్డు రకం బియ్యంతో పోలిస్తే ఈసారి కేటాయింపు పెంచాల్సి రావచ్చనే అభిప్రాయమూ ఉన్నది. రాష్ట్రంలో సుమారు 89 లక్షల వైట్ రేషను కార్డులుండగా వచ్చే నెల చివరి నాటికి మరికొన్ని కొత్తవి మంజూరు కానున్నాయి. ఈ లెక్కలు కొలిక్కి రావడంతో పాటు సన్న బియ్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే ఇంతకాలం బియ్యం తీసుకోని కుటుంబాలు కూడా ఈసారి కొంటారనే అంచనాలున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు, గురుకుల విద్యా సంస్థలు తదితర అవసరాలకు మరికొంత పక్కన పెట్టాల్సి ఉంటుంది. పంట కోతలు ప్రారంభమయ్యేనాటికి ఈ లెక్కలన్నీ పక్కాగా తేలనున్నాయి.

ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల్ని రుణ విముక్తుల్ని చేశామని ప్రభుత్వం ప్రకటించగా వడ్ల బోనస్‌తో మరింతగా ప్రచారం చేసుకోడానికి అవకాశం లభిస్తుంది. రైతు వేదికల ద్వారా దీన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలనే ఆలోచన ఉన్నది. వ్యవసాయాన్ని పండగ లాగా చేశామని ఇప్పటికే స్పష్టం చేసిన రాష్ట్ర సర్కారు... వడ్ల బోనస్‌ అంశంతో మరింత పాపులారిటీ వచ్చే అవకాశమున్నది. త్వరలోనే వరి సాగు విస్తీర్ణం, రానున్న దిగుబడి, అందులో సన్న రకం వడ్ల ఉత్పత్తి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం, సన్నాలు క్వాంటిటీ ఎంత... వీటిపై వచ్చే స్పష్టతకు అనుగుణంగా బోనస్ కోసం ప్రభుత్వం వెచ్చించాల్సిన ఫండ్ విషయంలో నిర్ణయం జరగనున్నది.

Next Story

Most Viewed