నామినేషన్ వేయకుండానే అరికపూడి పేరు ఎలా వచ్చింది: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

by Shiva |
నామినేషన్ వేయకుండానే అరికపూడి పేరు ఎలా వచ్చింది: ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నామినేషన్ వేయకుండానే అరికెపూడి గాంధీ పేరు ఎలా వచ్చిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను, హరీష్ రావు ,గంగుల కమలాకర్ నామినేషన్లు వేశామని తెలిపారు. పీఏసీ సభ్యుల కన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే ఓటింగ్ జరగాలని, ఓటింగ్ జరగకుండానే హరీష్ రావు నామినేషన్ ను ఎలా తొలగించారని ప్రశ్నించారు. అరికెపూడి బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయడానికి ఎవరు అనుమతించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ప్రపంచ మంతా చూసిందని, అన్ని పత్రికల్లో పబ్లిష్ అయిందని, తాను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని ఇప్పుడు బుకాయిస్తే ఎలా కుదురుతోందన్నారు. వార్తలు తప్పయితే మరుసటి రోజు గాంధీ ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చి కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా ఖూనీ చేసిందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతను సంప్రదించే పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దేశంలో ఆనాదిగా వస్తోందని, కానీ ఎవరిని అడిగి గాంధీకి ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వక పోవడం దేశంలో ఇదే మొదటి సారి కావొచ్చు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మెంబెర్స్ హ్యాండ్ బుక్ 65 వ పేజీ లో పీఏసీ చైర్మన్ పదవి ఎవరికిస్తారో స్పష్టంగా ఉందని వెల్లడించారు.

పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కు ఇవ్వడం పార్లమెంటరీ స్ఫూర్తికి, సాంప్రదాయాలకు విరుద్ధం...దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ లో ఓ సూత్రం ..తెలంగాణ లో మరో సూత్రమా అని నిలదీశారు. రేవంత్ విధానాన్ని ఢిల్లీ లో పాటిస్తే అక్కడ కేసీ వేణుగోపాల్ కు పీఏసీ చైర్మన్ పదవీ వచ్చేదా? అని ప్రశ్నించారు. హిమాచల్ లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పెన్షన్ తొలగించారు..తెలంగాణ లో నేమో పార్టీ మారిన ఎమ్మెల్యే కు పిలిచి పీఏసీ పదవి ఇచ్చారని మండిపడ్డారు. రాహుల్ విధానాలు తెలంగాణలో అమలు కావా?అని నిలదీశారు. హరీష్ రావు అంటే రేవంత్ కు భయం అని, అరికెపూడిని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

మొన్న జర్నలిస్టుల మీటింగ్ లో సీఎం రేవంత్ నీతులు చెప్పారు ..తెల్లారే గోతులు తవ్వారు అని ధ్వజమెత్తారు. పీఏసీపై స్పీకర్ పునరాలోచన చేయాలని కోరారు. పీఏసీపై స్పీకరు నిర్ణయం మారకపోతే గవర్నర్ ను కలవడం, ఇతర మార్గాలను అన్వేషిస్తాం అన్నారు. గాంధీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేనే అని, ఆయనను పీఏసీ చైర్మన్ గా నియమించమని ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించారని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారని.. అసలు కేసీఆర్ ను ఎప్పుడు సంప్రదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద నియంతగా మారాడు ..ఆయన తీరును ప్రతిఘటించి తీరుతామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed