హిందుత్వ కౌంటర్! కేసీఆర్ స్ట్రాటజీ ఇదేనా..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-21 03:11:42.0  )
హిందుత్వ కౌంటర్! కేసీఆర్ స్ట్రాటజీ ఇదేనా..?
X

సీఎం కేసీఆర్‌కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఈ విషయాన్ని వ్యక్తిగతంగానే కాదు.. పాలనలోనూ ప్రదర్శించేందుకు వెనుకాడరు. ప్రభుత్వ నిధులు రూ.1800 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని పునర్​నిర్మించారు. వేములవాడ, కొండగట్టు సహా పలు ఆలయాల అభివృద్ధికి వందల కోట్లతో అనుమతి ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినందుకు ఖజానా నుంచి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు కూడా మొక్కులు చెల్లించారు. ప్రాజెక్టులు, జిల్లాలు, జోన్లకూ దేవుళ్ల పేర్లు పెట్టారు. ఇక యజ్ఞయాగాదులతో కేసీఆర్ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. హిందూ ఆలయాలకు ధూప, దీప నైవేద్యాలు, మసీదుల మౌజన్‌లకు గౌరవ వేతనం కల్పించారు. - దిశ, తెలంగాణ బ్యూరో

’ఈ హిందుగాళ్లు.. బొందుగాళ్లు.. దిక్కుమాలిన దరిద్రపుగాళ్లు.. దేశంలో అగ్గి పెట్టాలె.. గత్తర లేవాలె..‘ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ బహిరంగసభలో వ్యాఖ్యలు చేసి సీఎం కేసీఆర్ విమర్శలపాలయ్యారు. హిందు వ్యతిరేకి అంటూ నిందలు ఎదుర్కొన్నారు. చివరకు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆధ్యాత్మిక చింతనతో హిందు సంప్రదాయంలో హోమాలు, యజ్ఞాలు చేస్తున్నా మరో సందర్భంలో.. ప్రధాని నుంచి ‘మూఢ నమ్మకాలపై ఆధారపడతారు.. జ్యోతిష్యాన్ని నమ్ముతారు... వాటి ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు.. నిమ్మకాయలు-మిర్చిపైన విశ్వాసమెక్కువ’ అని ఆరోపణలు ఎదుర్కొన్నారు.

భారీగా యాగాలు, హోమాలు

అయుత చండీ మహాయాగం, సుదర్శన హోమం, రాజశ్యామల యాగం లాంటి కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కేసీఆర్ గుర్తింపు పొందారు. చివరకు ఢిల్లీలోని బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్‌లో కూడా రాజశ్యామల యాగం నిర్వహించారు. ఒకవైపు పొలిటికల్‌గా సెక్యులర్ భావజాలాన్ని ప్రదర్శిస్తున్నా మరోవైపు హిందు పూజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పలేదు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సమయంలో ప్రధాని మోడీ సర్వమత ప్రార్థనలు చేస్తే కేసీఆర్ మాత్రం కొత్త సచివాలయం ఓపెనింగ్‌కు కేవలం హిందు పండితుల ఆశీర్వచనాలకే స్థానం కల్పించారన్న నిందలు మోయాల్సి వచ్చింది.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్ల పాలనలో ఆధ్యాత్మికం, వాస్తు, ఆలయాల సందర్శన మొదలుకుని అనేక అంశాల్లో హిందు సంప్రదాయాలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఏటా రంజాన్, క్రిస్మస్ పండుగలను సైతం అధికారికంగా నిర్వహిస్తున్నారు. బ్రాహ్మణ భవన్‌తో పాటు బంజారా, ఆదివాసీ భవనాలనూ ప్రారంభించారు. ఆత్మగౌరవ భవన్‌ల పేరిట బీసీ కులాలకు వేర్వేరు భవనాలు ముగింపు దశలో ఉన్నాయి. సాగునీటి ప్రాజెక్టులకు, జిల్లాలకు, జోన్లకు దేవుళ్ల పేర్లను పెట్టి ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్రం సాకారమైనందుకు పలు ఆలయాలకు వెళ్లి ప్రజాధనంతో మొక్కులు తీర్చుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలనూ సందర్శించారు.

సొంత ఖర్చుతో ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో యాగాలు, హోమాలు నిర్వహించారు. కేసీఆర్ ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రధాని మోడీ తప్పుపట్టినప్పుడు దానికి కూడా ఘాటుగానే బదులిచ్చారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ఆధ్యాత్మిక చింతనలో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైలైట్ చేస్తున్న పది అంశాల్లో ఇది కూడా ఒకటి. పలు ఆలయాల అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తామన్న హామీలతో పాటు ఆధ్యాత్మికతకు తెలంగాణ చిరునామాగా ఉండాలని, ప్రత్యేక కేంద్రంగా ఆవిర్భవించాలని తన మనసులోని మాటను బైటపెట్టారు. ముఖంమీద వీరతిలకం కనిపిస్తున్నా కుడిచేతికి ముస్లిం సంప్రదాయం ప్రకారం ‘దట్టీ’ కూడా ఉండడం కేసీఆర్ ప్రత్యేకత.

హిందుత్వ కౌంటర్​

హిందు ఆలయాల అభివృద్ధి, యజ్ఞయాగాదులు, పూజలు, హోమాలు.. ఇలా ఎన్ని చేసినా రాజకీయపరంగా మజ్లిస్ పార్టీతో స్నేహ సంబంధాలను కొనసాగించడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. హిందుత్వ ఎజెండాతో బీజేపీ చేస్తున్న కామెంట్లకు గులాబీ నేతలు ‘కేసీఆర్‌ను మించిన హిందువు లేరు’ అంటూ కౌంటర్ ఇస్తున్నారు. కులమతాలకు అతీతంగా అందరినీ ప్రభుత్వం సమాన దృష్టితోనే చూస్తున్నదని, అన్ని మతాలను గౌరవిస్తున్నదని, గంగా-జమునా తహజీబ్ తెలంగాణ సంస్కృతిలో భాగమంటూ సమర్థించుకుంటున్నారు. బీజేపీ ‘జై శ్రీరామ్’ అనే నినాదాన్ని ఎత్తుకుంటే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ‘రామ్ లక్ష్మణ్ జానకీ.. జై బోలో హనుమాన్ కీ‘ అనే స్లోగన్‌ను అందుకున్నారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి టర్ములోనే యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం కోసం చొరవ తీసుకున్నారు. టెంపుల్ అభివృద్ధి పనులకు 2016 ఏప్రిల్‌లోనే అంకురార్పణ జరిగింది. సుమారు రూ. 1,800 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ఆలయ పనులు కరోనా సమయంలో కాస్త నెమ్మదించినా చివరకు 2022 మార్చి 28న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రకాశం జిల్లా నుంచి తెప్పించిన కృష్ణశిల, పెంబర్తి కళాకారులు తయారుచేసిన ఇత్తడి ప్రధాన ద్వారం, తమిళనాడులోని తంజావూరు శిల్పకళా నైపుణ్యం.. మేళవింపుతో నిర్మాణం పూర్తయింది. విమాన గోపురానికి సుమారు 125 కిలోల బంగారాన్ని వాడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబం తరఫున 1.116 కిలోల బంగారాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. చినజీయర్ ఆలోచనలకు అనుగుణంగా ఆలయ డిజైన్ రూపొందినా చివరకు ఆయన లేకుండానే ప్రారంభోత్సవం పూర్తయింది.

మరికొన్ని టెంపుల్స్ కూడా

ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పలు ఆలయాలకు కూడా బడ్జెట్ నుంచి నిధులను కేటాయించారు. వాటిని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఆ ఆలయాలను సందర్శించినప్పుడు ఈ హామీలు ఇచ్చారు. కొండగట్టు ఆంజనేయ టెంపుల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 15న సందర్శించి సుమారు 850 ఎకరాల్లో ఆలయాన్ని డెవలప్‌ చేస్తామని, ఇందుకోసం గతంలో ప్రకటించినరూ. 100 కోట్లకు అదనంగా మరో రూ. 500 కోట్లను ఇస్తామని హామీ ఇచ్చారు. వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్‌ను 2019 డిసెంబరు 30న సందర్శించి అభివృద్ధి పనులకూ ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చివరకు మేడారం జాతర ప్రాంతాన్ని వందల ఎకరాల మేర అభివృద్ధి చేస్తామని చాలాకాలం కిందట హామీ ఇచ్చిన కేసీఆర్ 2020 ఫిబ్రవరి 7న సందర్శించి మరోమారు వాగ్ధానం చేశారు.

దేవుళ్లకు మొక్కు చెల్లింపులు

తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలంటూ ఉద్యమం సమయంలో పలు దేవుళ్లకు మొక్కుకున్న కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా వాటిని తీర్చుకోవడంపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ నిధులను తన వ్యక్తిగత మొక్కులకు వినియోగించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత నిధులను వాడడానికి బదులుగా కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానాల్లో వెళ్లి కోట్లాది రూపాయల ఖర్చుతో బంగారు ఆభరణాలను దేవుళ్లకు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లౌకిక స్ఫూర్తికి బదులుగా కేసీఆర్ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఒక మతానికి ప్రతినిధిగా నడుచుకుంటున్నారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు.

ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలకూ

తిరుమల శ్రీవారి ఆలయానికి కేసీఆర్ కుటుంబానికి చెందిన 47 మంది 2017 ఫిబ్రవరి 22న స్పెషల్ ఫ్లయిట్‌లో వెళ్ళి సుమారు ఐదున్నర కోట్ల రూపాయల విలువైన శాలిగ్రామ హారం (14.12 కిలోల బంగారంతో), పేటల కంటెల హారం (4.9 కిలోల బంగారం), పద్మావతి అమ్మవారికి 12.5 గ్రాముల ముక్కుపుడక సమర్పించారు. విజయవాడలోని కనకదుర్గ గుడికి 2018 జూన్ 28న వెళ్లిన కేసీఆర్ 52 డైమండ్లతో కూడిన 11.29 గ్రాముల ముక్కుపుడక ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మొక్కుల కోసం నిధులు మంజూరుకు ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) కూడా ఇచ్చింది.

భద్రకాళి టెంపుల్‌కు 12 కిలోల బంగారు కిరీటం

స్వరాష్ట్రంలోని పలు ఆలయాలకు వెళ్లిన కేసీఆర్ మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్‌లోని భద్రకాళి టెంపుల్‌కు 2016లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుమారు మూడు కోట్ల రూపాయల ఖర్చుతో 11.7 కిలోల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని వీరభద్ర ఆలయాన్ని 2017 ఫిబ్రవరి 24న సందర్శించి కోరమీసాలను సమర్పించారు. సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించారు.

ఇతర రాష్ట్రాల్లోని ఆలయాల విజిట్

స్వరాష్ట్ర, పొరుగు రాష్ట్రంలోని ఆలయాలే కాకుండా ఇతర స్టేట్స్ లోనూ పలు టెంపుల్స్ ను కేసీఆర్ సందర్శించారు. ఫస్టు టర్ములో 2018 డిసెంబర్​ 24న ఒడిశాలోని పూరి జగన్నాథ్​ టెంపుల్, 2018 మార్చి 19న కోల్‌కతాలోని కాళీమాత ఆలయాలను సందర్శించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాట్ల సమయంలో అక్కడి ప్రాంతీయ పార్టీల నేతలను కలవడానికి వెళ్లిన సందర్భంగా ఆలయాలను విజిట్ చేశారు. సెకండ్ టర్ములో 2019 మే 13న తిరుచ్చిలోని శ్రీరంగం రంగనాధ ఆలయాన్ని, 2019 మే 6న కేరళలోని అనంత పద్మనాభ ఆలయాన్ని సందర్శించారు. కేసీఆర్ భార్య శోభ, కుమార్తె కవిత 2021 జనవరి 28న యూపీలోని కాశీ విశ్వనాథ్​ ఆలయాన్ని సందర్శించారు.

యజ్ఞయాగాదుల్లో కేసీఆర్ ముద్ర

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 డిసెంబరు చివరి వారంలో ఐదు రోజుల పాటు ఎర్రవల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో అయుత చండీ మహాయాగాన్ని, సుదర్శన హోమాలను నిర్వహించారు. అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా హాజరయ్యారు. వ్యక్తిగత నమ్మకాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శలు రావడంతో సొంత డబ్బులనే వినియోగిస్తున్నట్లు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

చివరిరోజున అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకావడానికి నగరానికి చేరుకున్నా అగ్నిప్రమాదం జరగడంతో వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత 2018 డిసెంబరులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబరు 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల యాగాన్ని ఎర్రవెల్లిలోనే నిర్వహించారు. యజ్ఞం కారణంగా తిరిగి అధికారంలోకి వచ్చిన సంతృప్తితో 2019 జనవరి 21 నుంచి ఐదు రోజుల పాటు సహస్ర చండీయాగాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ఢిల్లీలో లీజుకు తీసుకున్న సెంట్రల్ ఆఫీసు భవనంలో రాజశ్యామల యాగం చేపట్టారు.

కేసీఆర్ వర్సెస్ మోడీ డైలాగ్ వార్

వాస్తు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం ఆధారంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారంటూ నిజామాబాద్ వేదికగా 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ విమర్శలు చేశారు. నిజామాబాద్‌ను లండన్‌గా మారుస్తారంటూ గతంలో హామీ ఇచ్చి ఫెయిల్ అయ్యారన్న రాజకీయ విమర్శలకు కొనసాగింపుగా కేసీఆర్ వ్యక్తిగత విశ్వాసాలను తూర్పారబట్టారు. దీనికి కేసీఆర్ సైతం ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.

మహబూబ్‌నగర్‌లో జరిగిన ర్యాలీలో కేసీఆర్ ప్రసంగిస్తూ... ‘నా విశ్వాసాలతో మీకొచ్చిన ఇబ్బందేంటి? నా పూజలతో ఏం నష్టం జరుగుతుంది? సంవత్సరానికి పది యాగాలు చేస్తాను. విశ్వాసంతో హాజరైనవారికి ప్రసాదంతో పాటు తీర్థం ఇస్తాం. మీకూ అలాంటి విశ్వాసముంటే హాజరు కావొచ్చు.. తీర్థ ప్రసాదాలు అందుకోవచ్చు. నేను వ్యక్తిగతంగా చేసుకుంటూ ఉంటే మీకెందుకు అంత బాధ?’ అని తిప్పికొట్టారు.

జిల్లాలు, ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు

దేవుడిమీద విశ్వాసంతో కొత్త స్కీమ్‌లకు, జిల్లాలకు, జోన్లకు, సాగునీటి ప్రాజెక్టులకు దేవుళ్ల పేర్లు పెట్టారు. కల్యాణలక్ష్మి, గృహలక్ష్మి లాంటి స్కీమ్‌లకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలో భాగంగా ఏడు జోన్లకు కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, జోగులాంబ, చార్మినారర్ పేర్లు పెట్టారు. కొత్త జిల్లాలకు యాదాద్రి, భద్రాద్రి, రాజన్న (రాజరాజేశ్వర స్వామి), జోగులాంబ (అమ్మవారు) పేర్లు పెట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు కాళేశ్వరం, సంగమేశ్వర-బసవేశ్వర, సీతారామ సాగర్, భక్త రామదాసు, సమ్మక్క-సారలమ్మ బ్యారేజీ, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ తదితర పేర్లు పెట్టారు. కాళేశ్వరం పరిధిలోని పంప్‌హౌజ్‌లకూ లక్ష్మి, పార్వతి, సరస్వతి లాంటి పేర్లు పెట్టారు. ఇవన్నీ దేవుళ్ల పేర్లతోనే కొనసాగుతున్నాయి.

Also Read..

సారుకు ఫికర్! పార్టీ పరిస్థితులపై గులాబీ బాస్‌కు టెన్షన్

Advertisement

Next Story

Most Viewed