BREAKING: అశోక్ నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఎక్కడికక్కడే స్తంభించిపోయిన వాహనాలు

by Satheesh |   ( Updated:2024-07-13 15:31:22.0  )
BREAKING: అశోక్ నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఎక్కడికక్కడే స్తంభించిపోయిన వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అశోక్ నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయడంతో పాటు గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అశోక్ నగర్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయడం కుదరని, షెడ్యూల్ ప్రకారం యధావిధిగా పరీక్షలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని మరోసారి డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో పెట్టుకోకుండా తమ సమస్యలు వెంటనే పరిష్కారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉంటే, నిరుద్యోగుల ఆందోళనతో అశోక్ నగర్‌లో వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి నిరుద్యోగులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగులు, పోలీసుల మధ్య వాగ్వాదంతో అశోక్ నగర్‌లో హై టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed