నేతలపై TDP అధిష్టానం నిఘా.. ఆ లీడర్లందరికి వచ్చే ఎన్నికల్లో నో టికెట్!

by Satheesh |
నేతలపై TDP అధిష్టానం నిఘా.. ఆ లీడర్లందరికి వచ్చే ఎన్నికల్లో నో టికెట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ నేతలపై అధిష్టానం నిఘా పెట్టింది. ఎవరెవరూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనే వివరాలను సేకరిస్తుంది. పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా ఎన్టీఆర్ భవన్‌కు పరిమితం అవుతున్న నేతలను ఆరా తీస్తుంది. ఇప్పటికే పలువురి నేతల వివరాలను ఆపార్టీ అధినేత సేకరించినట్లు సమాచారం. యాక్టీవ్‌గా లేనివారికి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరణ, రాష్ట్ర కమిటీల్లో సైతం అవకాశం కల్పించకుండా దూరంపెట్టాలనే యోచనలో ఉంది.

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందకు పార్టీ అధిష్టానం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక సెల్‌తో పాటు యాప్‌ను సైతం రూపొందించింది. ప్రతి రోజూ జరిగిన కార్యక్రమ వివరాలను నమోదు చేస్తుంది. అందుకోసం అబ్జర్వర్లను సైతం నియమించింది. అయితే కొన్ని డివిజన్, మండల స్థాయిలో చురుగ్గా పార్టీ కార్యక్రమం జరగడం లేదనే సమాచారాన్ని పార్టీ అధిష్టానం గుర్తించింది.

ఎవరెవరూ పార్టీ కార్యక్రమాలను అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే వివరాలను సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలో యాక్టీవ్‌గా పనిచేసేవారికే పార్టీ రాష్ట్ర కమిటీలతో పాటు అసెంబ్లీ టికెట్ సైతం కేటాయిస్తామని స్పష్టం చేశారు. అయిన్నప్పటికీ కొంతమంది సీనియర్ నేతలు మాత్రం అధిష్టానం ఆదేశాలు భేఖాతర్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో అలసత్వం వహించే నేతల వివరాలను ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది. వారికి త్వరలోనే చెక్ పెట్టే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

భవన్‌కే పరిమితవుతున్న నేతలకు చెక్

గత కొంతకాలంగా పార్టీ పదవులను అనుభవిస్తూ కొందరు పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం లేదు. కేవలం చెప్పుకోవడానికే ఆలంకారప్రాయంగా అనుభవిస్తున్నట్లు అధిష్టానం భావించింది. దాంతో రాష్ట్ర అధ్యక్షుడు కాసాని కమిటీలను రద్దు చేశారు. పార్టీ బలోపేతంపై చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కొంతమంది సీనియర్లలో మార్పుమాత్రం కనిపించడం లేదని గుర్తించింది. ఎన్టీఆర్ భవన్‌కు పరిమితమవుతున్న నేతలపై దృష్టిసారించిన పార్టీ అధిష్టానం వారి వివరాలను సేకరించింది.

అంతేగాకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధానకార్యదర్శి లోకేష్ ఎన్టీఆర్ భవన్‌కు వచ్చినప్పుడు నినాదాలు చేస్తూ హల్ చల్ చేస్తుండటం, ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వారి నియోజకవర్గాల్లో కేడర్‌ను పట్టించుకోకపోవడంతో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారి పోతుందనే వివరాలను సైతం సేకరించింది. ఆశించిన స్థాయిలో వారి పనితనం లేకపోవడంతో త్వరలోనే వారికి చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

నేతల పనితనానికి గీటురాయిగా ‘ఇంటింటికీ టీడీపీ’

టీడీపీలోని సీనియర్ నేతల్లో పదవులు రాలేదనే అసంతృప్తిలో ఉన్నారు. గతంలో పనిచేయనివారికి పదవులు ఇచ్చారని, పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వలేదనే అసంతృప్తిలో ఉన్నారు. అయితే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం గీటురాయిగా మారనుంది. నేతల పనితనానికి నిదర్శనం కానుంది. నియోజకవర్గంలో 35వేలు సభ్యత్వం చేసేవారికి టికెట్ ఇస్తామని, పార్టీలో సైతం గుర్తింపు ఇస్తామని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది.

ఇప్పటివరకు అసంతృప్తితోఉన్న నేతలకు ఇది అవకాశం కానుంది. యాక్టీవ్ గాపనిచేసేవారికి పదవులు దక్కే అవకాశం ఉంది. కొంతమంది పార్టీ కార్యక్రమం నిర్వహించాలంటే పార్టీ డబ్బులు ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. అయితే వారిని పక్కనబెట్టి మరోనేతకు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఏరివేత కార్యక్రమం స్టార్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story

Most Viewed