గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్

by karthikeya |   ( Updated:2024-10-04 12:59:58.0  )
గ్రూప్ 1 పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీజీపీఎస్‌సీ గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ రోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. అటు పరీక్షలను రద్దు చేయాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్ల వాదనలతో పాటు టీజీపీఎస్‌సీ వాదనలను కూడా సానుకూలంగా విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. గ్రూప్ 1లో తప్పుడు ప్రశ్నలు వచ్చాయని, వాటిని తొలగించి, మెరిట్ జాబితా విడుదల చేయాలని పిటిషనర్లు కోర్టుకు తమ వాదన వినిపించగా, సబ్జెక్ట్ నిపుణుల కమిటీ పరిశీలన తర్వాతే కీ రూపొందించామని టీజీపీఎస్‌సీ ధర్మాసనానికి వివరించింది. ఈ క్రమంలోనే తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉండడంతో ఆ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే గ్రూప్ 1 పరీక్షను రద్దుచేయాలని, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు చెల్లదని, తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే టీజీపీఎస్‌సీ తరపు న్యాయవాది.. ప్రిలిమినరీ పరీక్షలపై వచ్చిన అభ్యంతరాలకు అర్థం లేనివని, పిటిషనర్‌లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా పిటిషన్‌లు దాఖలు చేశారని, ఏదో ఓ పుస్తకాన్ని ప్రామాణికంగా చేసుకుని పరీక్షల్లో ప్రశ్నలే తప్పనడం సమంజసం కాదని, 3 లక్షల మందిలో ఒకరిద్దరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఇది మెయిన్స్‌ కోసం సిద్ధమవుతున్న వారిని అయోమయానికి గురిచేసే చర్యని ఆక్షేపించారు. ఈ క్రమంలోనే తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed