Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డి హౌజ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు రిజిస్ట్రీ

by Y. Venkata Narasimha Reddy |
Patnam Narender Reddy : పట్నం నరేందర్ రెడ్డి హౌజ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు రిజిస్ట్రీ
X

దిశ, వెబ్ డెస్క్ : లగచర్ల దాడి కేసులో ఏ1 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటు చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy)ని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన హూజ్ మోషన్ (House Motion Petition) పిటిషన్ తిరస్కరణకు గురయ్యింది. నేడు కోర్టుకు సెలవు కావడంతో నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణ నేరస్తులు మరో ఐదుగురితో కలిపి పట్నం నరేందర్ రెడ్డిని జైలులో ఉంచారని పిటిషన్ లో పేర్కొన్నారు. మాజీ ఎంఎల్ఏగా ప్రత్యేక బ్యారక్ లో పట్నం నరేందర్ ను ఉంచాలని న్యాయవాది తన పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ పిటిషన్ ను తిరస్కరించారు.

మరోవైపు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వాధికారులపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అటు పట్నం నరేందర్ రెడ్డి సైతం తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయవాదుల ద్వారా ఆయన కోర్టుకు అఫిడవిట్‌ పంపించారు. ఈ కేసులో తన పేరుని ఏ1గా పెట్టారని నరేందర్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అరెస్ట్‌కు ముందు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని కేటీఆర్ సహా ఇతరులు అదేశాలతో దాడులు చేసినట్లు ఫేక్ స్టోరీని పోలీసులు క్రియేట్ చేశారని అఫిడవిట్‌లో తెలిపారు. అసలు తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్న నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో వారు చెప్పినవన్ని నిజం కాదన్నారు. దయచేసి తన స్టేట్మెంట్‌ను పరిగణనలోకి తీసుకోని విచారణ చేయాలని అఫిడవిట్‌లో పట్నం నరేందర్ రెడ్డి కోర్టును కోరారు. పోలీసుల కస్టడీ పిటిషన్, నరేందర్ రెడ్డి బెయిల్, క్వాష్ పిటిషన్లపై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. లగచర్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏ2గా ఉన్న బోగమోని సురేష్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు ఇప్పటికే 47మందిపై కేసు నమోదు చేయగా, 16మందిని రిమాండ్ చేశారు. తాజాగా మరో 10మందిని అరెస్టు చేసి రహస్యంగా విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed