నిండు వేసవిలో దంచికొట్టిన వాన..

by Sathputhe Rajesh |
నిండు వేసవిలో దంచికొట్టిన వాన..
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : నిండు వేసవిలో జీహెచ్ఎంసీ పరిధిలో కుండపోతగా కురిసిన వర్షం ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మొదలైన వర్షం గంటల పాటు ఏకధాటిగా కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాలలో రోడ్లపై మోకాలు లోతుకు పైగా వర్షం నీరు నిలిచిపోయింది.

జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం

సికింద్రాబాద్ కళాసీగూడలో తెరచి ఉంచిన మ్యాన్ హోల్‌లో పడి ఇంటి నుండి పాల కోసం బయటకు వచ్చిన తొమ్మిదేళ్ల చిన్నారి మౌనిక మృత్యువాత పడింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ గత మూడు రోజులుగా హెచ్చరిస్తున్నప్పటికీ బల్దియా అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనబడింది. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం, కళాసీగూడలో తవ్వి ఉంచిన రోడ్డులో తెరచి ఉంచిన మ్యాన్ హోల్‌ను మూసి వేయకపోవడం, దాని చుట్టూ ఎలాంటి బ్యారీకేడ్లు వేయకపోవడంతో చిన్నారి మృత్యువాత పడి కుటుంబంలో పెను విషాదం నింపింది. ఇదిలా ఉండగా కళాసీగూడలో మృతి చెందిన బాలిక కుటుంబానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ తరపున రూ.2 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించారు.

చెరువుల్లా రోడ్లు.. కొట్టుకోపోయిన వాహనాలు

గ్రేటర్ హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం ప్రజలకు కడగండ్లు మిగిల్చింది. లోతట్టు ప్రాంతాలో జలమయం కాగా వరద నీరు పొంగి ప్రవహించింది. చాలా చోట్ల ఇండ్ల ముందు నిలిపి ఉచిన వాహనాలు వరద దాటికి కొట్టుకుపోయాయి. బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, మియాపూర్, టోలీచౌకీ నదీం కాలనీ, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, బాగ్ లింగంపల్లి, ముషీరాబాద్, పంజాగుట్ట, కోఠి, ఆబిడ్స్, ఎంజే మార్కెట్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణ గూడ, దిల్ సుఖ్ నగర్, అంబర్ పేట్, ముషారాంబాగ్, కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీ నగర్, రామాంతాపూర్, పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. వేకువ జామున భారీవర్షం కురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భారీవర్షంతో వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో

వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. టోలీచౌకీ నదీం కాలనీలో భారీ వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిండి. టోలీచౌకీ ఫ్లై ఓవర్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జీ వద్ద భారీగా నీరు చేరడంతో గచ్చిబౌలి, లింగంపల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అడిక్‌మెట్‌ డివిజన్‌లోని పద్మా కాలనీలోని ఇళ్ళల్లోకి భారీ వరద నీరు వచ్చి చేరింది. కాలనీలో ద్వి చక్ర వాహనాలు కొట్టుకు పోయాయి. అలాగే బాగ్ లింగంపల్లి సూర్యనగర్‌లో కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకు పోయాయి. హుస్సేన్ సాగర్ నాలా పరివాహక ప్రాంతాలైన గాంధీనగర్ డివిజన్‌లోని అరుంధతి నగర్, సబర్మతి నగర్, దోమలగూడ అరవింద్ నగర్లో, ముషీరాబాద్ డివిజన్ బాపూజినగర్, ఆదర్శ కాలనీ, గణేష్ నగర్ తదితర భారీగా వరద నీరు వచ్చి చేరింది.

వర్షాపాతం ఇలా..(సెం. మీ)

విఠల్ వాడి7.78, ఖాజాగూడ 7.1, ఆనంద్ బాగ్ 6.4, ముషీరాబాద్ 6.4, షేక్ పేట్ 6.2, ఎల్బీ స్టేడియం 6.2, మోండా మార్కెట్ 5.7 వర్షాపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా శనివారం రాత్రి వరకు మరోమారు భారీ వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed