మొబైల్ ఫోన్ ఉందా? సర్కారు సేవలు ఇక మీ చేతుల్లో!!!

by Sathputhe Rajesh |
మొబైల్ ఫోన్ ఉందా? సర్కారు సేవలు ఇక మీ చేతుల్లో!!!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పనికైనా రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఇంట్లో కూర్చొనే పనులన్నీ చక్కబెట్టేలా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. కాలంతోపాటు పనుల నిర్వహణ కూడా ఈ స్మార్ట్‌గా మారాయి. మొబైల్ యాప్స్‌పై కాస్తంత అవగాహన ఉంటే చాలా పనులు నిమిషాల వ్యవధిలోనే చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక యాప్స్‌తో పనులు సులువుగా పూర్తవుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి ఈ సంజీవని యాప్ ఇటీవల చాలా పాపులర్ అవుతున్నది. ఇంట్లో కూర్చొనే ఎయిమ్స్, ఈఎస్ఐ వైద్యులతో నేరుగా మాట్లాడుతూ చికిత్స తీసుకొనే సౌలభ్యం ఉండటం ఈ యాప్ విశిష్టత. వైద్యులు కూడా వాయిస్ కాల్‌తో పాటు అవసరం మేరకు వీడియోకాల్‌లో రోగుల పరిస్థితి తెలుసుకుని ప్రిస్కిప్షన్ ఇస్తున్నారు.

ఆరోగ్య సేతు

కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడం.. వదంతులు నివారించడంతో పాటు కచ్చితమైన సమాచారం చేరవేసేందుకు భారత ప్రభుత్వం ఈ యాప్ తీసుకువచ్చింది. కొవిడ్ బారినపడినవారి ఆరోగ్య రక్షణకు సంబంధించిన సూచనలు చేయడంతోపాటు అవసరం మేరకు ఆస్పత్రులకు తరలించేలా ఏర్పాటు చేసింది.

వైద్య శాఖ చేసే సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు రోగులకు చేరడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ యాప్ విస్తృతంగా ఉపయోగపడింది. ఈ యాప్ రూపొందించిన కొద్ది నెలల్లోనే 10 కోట్లమంది డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు అత్యధిక మంది వినియోగించుకున్నారు.

డిజి లాకర్

పేరుకు తగినట్టుగానే ఇందులో అన్ని దాచుకోవచ్చు. కీలకమైన డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సమయాల్లో వినియోగించుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) ఈ యాప్‌ను నిర్వహిస్తున్నది. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ సహా ప్రభుత్వం అందించే అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ యాప్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఫలితంగా వీటిని ఎక్కడికి మోసుకుపోకుండా ఫోన్ సాయంతోనే అవసరమైన చోట వాడుకోవచ్చు.

ఈ - పాఠశాల

ఈ యాప్ పాఠశాల విద్యార్థుల అవసరార్థం ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని తరగతుల పాఠాలు సబ్జెక్టు వారీగా పొందు పరిచి ఉంటాయి. పాఠాలు సవివరంగా బోధించే ఏర్పాట్లు ఉన్నాయి. పాఠంలోని ముఖ్యమైన పాయింట్స్‌ను హైలైట్ చేస్తే కాపీ అవుతాయి. దీంతో సొంతంగా నోట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ శాఖ ఈ యాప్‌ను నిర్వహిస్తున్నది. సీబీఎస్ఈ విద్యార్థులకు ఈ యాప్ ఉపయుక్తంగా ఉంటుంది.

ఎం - ఆధార్

ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా ఆధార్ ఉండాల్సిందే. అందుకే ఫోన్ నంబర్ గుర్తు పెట్టుకున్నట్టు ఆధార్ నంబర్ గుర్తు పెట్టుకుంటున్నారు. రైలు రిజర్వేషన్ చేయాలన్నా.. తిరుపతిలో దర్శనం టికెట్ తీసుకోవాలన్నా అన్నింటికీ ఆధారే ఆధారం. ఎప్పుడైనా ఆధార్ కార్డు మరిచిపోతే ఇంటికి పరుగు తీయకుండా ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో ఆధార్ కార్డు స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అడ్రస్ మార్చుకోవడం సహా చిన్న చిన్న మార్పులు ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు. ఈ యాప్ స్థానిక భాషల్లోనూ పనిచేస్తుంది.

మదద్ (madad)

చదువులు, ఉపాధి కోసం దేశం కాని దేశం వెళ్లే వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టెర్నల్ అఫైర్స్ (ఎంఈఏ) శాఖ నిర్వహిస్తున్నది. విదేశాల్లోని భారతీయులకు ఏదైనా సాయం కావాల్సి వస్తే ఆయా దేశాల రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేస్తుంది.

ఆయా దేశాల్లోని ఇండియన్ ఎంబసీల చిరునామా సహా నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది. అకాల సమయాల్లో విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులకు తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఈ యాప్ సాయపడుతుంది. విదేశీ గడ్డపై చేయని నేరంలో చిక్కుకున్నా.. పనిస్థలాల్లో వేధింపులు ఎదురైనా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

ఎం - పాస్ పోర్ట్ సేవా

మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ (ఎంఈఏ) శాఖ నిర్వహిస్తున్న మరో యాప్ ఇది. ఇందులో కేవలం పాస్ పోర్ట్ తీసుకోవడంతో పాటు దానికి సంబంధించిన అంశాలపై సమస్యలను ఈ యాప్ పరిష్కరిస్తుంది. పాస్ పోర్ట్ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉందో ఎప్పటి వరకు వస్తుందనే విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది.

మై - గవ్ (My Gov)

భారత ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలతో పాటు చేస్తున్న సూచనలు సలహాలపై భారత పౌరులు నేరుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. ఈ యాప్లో పౌరులు చేసిన సూచనలు సలహాలను ఆయా విభాగాల అధికారులు పరిశీలన చేసి.. ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. ఈ యాప్ ప్రభుత్వ పాలసీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ప్రజలకు పూర్తి వివరాలను అందుబాటులో ఉంచుతుంది. కొవిడ్ మహమ్మారి సమయంలో ఈ యాప్ దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా నమోదైన కొవిడ్ బాధితుల సంఖ్యను రోజువారీగా అందుబాటులో ఉంచింది.

ఉమాంగ్ (UMANG)

యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్‌గా పిలిచే ఈ యాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలను పొందవచ్చు. కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల సేవలు కూడా ఈ యాప్‌లో పొందుపర్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 'మీ సేవ' కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నది. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఈ - సంజీవని

ఇల్లు కదలకుండానే వైద్య సేవలు అందించడమే ఈ యాప్ గొప్పతనం. రాష్ట్రాల వారీగా నిష్ణాతులైన ఎయిమ్స్ వైద్యుల సేవలు పొందవచ్చు. అయితే, ముందుగా ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జనరల్ సేవలతో పాటు స్పెషాలిటీ సేవలు కూడా ఈ యాప్ ఉచితంగా అందుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక టోకెన్ వస్తుంది. ఆ సమయంలో వాయిస్ కాల్లో వైద్యుడితో నేరుగా మాట్లాడి సమస్యకు చికిత్స తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వైద్యుడు వీడియోకాల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. దీంతో మరింత నాణ్యమైన సేవలు అందుతాయి. వైద్యుడు ఇచ్చే ప్రిస్క్రిప్షన్‌ను డౌన్లోడ్ చేసుకుని మందులు వాడుకుంటే సరిపోతుంది.

Advertisement

Next Story