‘అప్పటికే 11 రోజులు అయ్యింది.. KCR ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది’

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-17 08:58:03.0  )
‘అప్పటికే 11 రోజులు అయ్యింది.. KCR ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది’
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కేసీఆర్ పుట్టిన రోజు(KCR Birthday) వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్(KCR) జన్మదినం రాష్ట్ర ప్రజలందరికీ పండుగ దినమని అన్నారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. ఒక నాయకుడు కాదు.. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమని తెలిపారు. 1969లో మలి దశ తెలంగాణ ఉద్యమం వచ్చిన నాడు కేసీఆర్ వయస్సు 16 ఏండ్లు.. 16 ఏండ్లలోనే ‘జై తెలంగాణ’ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. కేసీఆర్ సహా తెలంగాణ వాదులు ఇష్టం ఉన్నా లేకున్నా ఆంధ్ర పాలకుల పార్టీల్లో పని చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తూ వచ్చారు. అన్ని భరించారు. తెలంగాణ బాగు పడాలంటే రాష్ట్ర ఏర్పాటు తప్ప మరొక దారి లేదని బయటికి వచ్చారని అన్నారు. 2001 తర్వాత తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. మూడు పదవులను గడ్డి పోచలుగా వదిలేశారు.. డిప్యూటీ స్పీకర్, కార్యదర్శి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ప్రజల్లో నమ్మకం కల్పించారని అన్నారు. 2001 నుంచి కేసీఆర్‌తో పనిచేసే అదృష్టం నాకు దొరికిందన్నారు.

కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధమై ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. ఆయన దీక్ష చేయకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చిదంబరం ఫోన్ చేసినా వినలేదు. తెలంగాణ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వస్తేనే దీక్ష విరమిస్తానని భీష్మించుకున్నడు. అప్పటికే 11 రోజులు అయ్యింది. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. కానీ పట్టుదల మాత్రం వదలలేదని హరీష్ రావు అన్నారు. చివరకు ఢిల్లీ పెద్దలను ఒప్పించి తెలంగాణ తెచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్ పుణ్యమా? అని ఇప్పుడు పదవులు అనుభించే నాయకులంతా ఒకడు తెలంగాణ తెచ్చినం అంటడు. ఒకడు తెలంగాణ ఇచ్చినం అంటడని మండిపడ్డారు.

Next Story
null