గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టులో షాక్..

by Mahesh |   ( Updated:2024-10-18 16:02:00.0  )
గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టులో షాక్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయలేమని, రద్దు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసిన హైకోర్టు ఆ పిటిషన్లను శుక్రవారం డిస్మిస్ చేసింది. పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలని స్పష్టం చేసింది. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని, చివరి నిమిషంలో వాయిదా వేసి ఇబ్బందులు సృష్టించలేమని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల వాయిదా, రద్దుపై గతంలో ఇదే హైకోర్టులో దాకలైన పిటిషన్లను జస్టిస్ పుల్లా కార్తీక్ విచారించి తీర్పు వెలువరించారని, అది సమంజసమైనదేనని సీజే బెంచ్ నొక్కి చెప్పింది. దీంతో గ్రూప్-1 పరీక్షలు యధావిధిగా జరిగేందుకు మార్గం సుగమమైంది. పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 29ను రద్దు చేయాలని కోరారు. సోమవారం విచారణ జరిగే అవకాశముంది.

స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని... రిలీజ్ చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులున్నాయని... ‘తుది కీ లో సైతం ఏడు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని... వాటికి కూడా మార్కులు కలిపి లిస్ట్ ప్రిపేర్ చేయాలని... తప్పు సమాధానాలను తొలగించి ‘సవరించిన కీ’ ని విడుదల చేయాలని... వాటి ఆధారంగానే మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను రూపొందించాలని... సవరించాలన్న అభ్యంతరాలను సైతం కమిషన్ పట్టించుకోలేదని... ఇలా వేర్వేరు ప్రేయర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి తరపున హాజరైన లాయర్లు శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా... వందలాది పోస్టులను భర్తీ చేసేందుకు కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని, లక్షలాది మంది ప్రిలిమ్స్ రాశారని, తప్పులను సరిదిద్దకుండా మెయిన్స్ నిర్వహిస్తే చాలా మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ‘ప్రాథమిక కీ’లోని తప్పులపై అభ్యర్థులు అభ్యంతరాలను వ్యక్తం చేసినా కమిషన్ పట్టించుకోలేదని ఆరోపించారు.

గత ప్రభుత్వం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌నురద్దు చేయకుండానే ప్రస్తుత ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ను జారీ చేసిందని, ఇది చెల్లదని న్యాయవాదులు ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు ఇదే హైకోర్టును ఆశ్రయించారని, అప్పట్లో పరీక్షను రద్దు చేసిందని తాజా విచారణ సందర్భంగా న్యాయవాదులు గుర్తుచేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాదులు లేవనెత్తిన అంశాలపై కమిషన్ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ... అభ్యర్థుల నుంచి ఆమోదం లభించిన తర్వాతనే ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించినట్లు తెలిపారు. ప్రిలిమ్స్ రాసిన మూడు లక్షల మందికి పైగా అభ్యర్థుల నుంచి వచ్చిన ఆరోపణలకు అనుగుణంగా అభ్యంతరాలను కమిషన్ కోరిందని, దీనికి 721 మంది ఫిజికల్‌గా కమిషన్‌కు వివరాలను అందజేశారని, మరో 6,470 మంది ఆన్‌లైన్ ద్వారా తెలియజేశారని, వీటన్నింటినీ కమిషన్ స్వీకరించి పరిగణనలోకి తీసుకున్నదని వివరించారు. ప్రిలిమ్స్ లోని సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి అభ్యర్థుల అభ్యంతరాలను పంపించామని, ఆ కమిటీ ఇచ్చిన నోట్ మేరకే ఫలితాలను విడుదల చేసినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని, అభ్యర్థులందరి సందేహాలను కమిషన్ నివృత్తి చేయడంతో మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నారని కమిషన్ తరఫు న్యాయవాది వివరించారు. ఇరువైపులా వాదనలను పరిగణనలోకి తీసుకున్న సీజే బెంచ్... పిటిషన్లన్నింటినీ డిస్మిస్ చేసి ప్రస్తుత పరిస్థితుల్లో మెయిన్స్ ఎగ్జామ్స్ ను రద్దు చేయడమో లేక వాయిదా వేయడమో కుదరదని, వేలాది మంది ప్రిపేర్ అవుతున్నందున ప్రభుత్వానికి కూడా ఈ దిశగా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని, షెడ్యూలు ప్రకారం పరీక్షలు యధావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. మరోవైపు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కమిషన్‌తో పాటు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే పలు సమీక్షలు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 46 ఎగ్జామ్ సెంటర్ల దగ్గర చేపట్టాల్సిన భద్రతా చర్యలు, మాల్ ప్రాక్టీస్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోషల్ మీడియా ద్వారా అభ్యర్థుల్లో గందరగోళం తలెత్తకుండా అప్రమత్తంగా ఉండడంపై ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సీజే బెంచ్ కొట్టివేయడం తో పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షల తేదీ దగ్గర పడుతున్నందున అత్యవసర పిటిషన్‌గా విచారించాలని కోరారు. పరిస్థితిని గమనంలోకి తీసుకుని తొలి కేసు గానే సోమవారం విచారణకు తీసుకునే అవకాశం ఉందని ఢిల్లీలో మీడియాతో పలువురు అభ్యర్థులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed