గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. మొత్తంగా 129 మందికి ఇచ్చేలా ఉత్తర్వులు

by Gantepaka Srikanth |
గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. మొత్తంగా 129 మందికి ఇచ్చేలా ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి నిమిత్తం గల్ఫ్(Gulf Victims) దేశాలకు వెళ్లి అక్కడ కొన్ని కారణాలతో మృత్యువాత పడిన కుటుంబాలను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఫ్యామిలీకి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున అందజేసేలా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. అందులో భాగంగా మొత్తం 15 జిల్లాల పరిధిలో గల్ఫ్ బాధిత కుటుంబాలు ఉన్నట్లు సాధారణ పరిపాలనా శాఖ ద్వారా వివరాలను తెలుసుకున్న ప్రభుత్వం.. మొత్తంగా రూ. 6.45 కోట్లను కేటాయించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలను గుర్తించి ఎక్స్ గ్రేషియా రూపంలో అందించేలా బడ్జెట్ నుంచి కేటాయింపులు చేసింది.

ఆ ప్రకారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లాకు రూ.1.75 కోట్లు (35 కుటుంబాలకు), జగిత్యాల జిల్లాకు రూ.1.40 లక్షలు (28 కుటుంబాలు), సిరిసిల్ల జిలాలకు రూ.60 లక్షలు (12 కుటుంబాలు), నిర్మల్ జిల్లాకు రూ.50 లక్షలు (10 కుటుంబాలు) చొప్పున కేటాయించగా కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ఆదిలాబాద్, హన్మకొండ, కొత్తగూడెం, పెద్దపల్లి, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు తలా రూ.20 లక్షల (4 కుటుంబాలు) చొప్పున కేటాయిస్తున్నట్లు చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed