కరెంటు బిల్లు, నీటిపన్ను తరహాలో ఆస్తిపన్ను.. ఇకపై నెల నెలా..!

by karthikeya |
కరెంటు బిల్లు, నీటిపన్ను తరహాలో ఆస్తిపన్ను.. ఇకపై నెల నెలా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు ఇప్పుడున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే నల్లా, కరెంట్ బిల్లుల తరహాలో ఆస్తి పన్నును సైతం నెలనెలా వసూలు చేయాలని ఆలోచిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదట ఈ విధానాన్ని అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నది. ఈ విధానంపై సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ప్రస్తుతం ఆస్తి పన్నును జీహెచ్‌ఎంసీ వసూలు చేస్తుంటే, నల్లా బిల్లులను హైదరాబాద్‌ జలమండలి కలెక్ట్ చేస్తున్నది.

నెలనెలా కరెంటు, నల్లా బిల్లులు

జీహెచ్‌ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నది. అంతకు మించి నీటిని వాడుతున్న అపార్ట్ మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తున్నది. నల్లా బిల్లును జలమండలి కార్యాలయాలతోపాటు ఆన్ లైన్ లోనూ చెల్లించేవిధంగా అధికారులు వెసులుబాటు కల్పించారు. వినియోగదారులు చెల్లించకపోతే అధికారులే నేరుగా వెళ్లి వసూలు చేస్తున్నారు. గడువులోగా చెల్లించకపోతే పెనాల్టీ విధిస్తున్నారు. అంతేకాకుండా నల్లా కనెక్షన్ తొలగించే నిబంధనలూ ఉన్నాయి. కరెంటు బిల్లులను సైతం డిస్కంలు ప్రతి నెలా వసూలు చేస్తున్నాయి. సకాలంలో చెల్లించకుంటే అపరాధ రుసుము వసూలు చేయడంతోపాటు కనెక్షన్ కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి.

ఈజీ పేమెంట్ విధానంతో ఆస్తి పన్ను

జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఆస్తి పన్ను ఆరు నెలలకొకసారి వసూలు చేస్తున్నారు. అయితే ఒకేసారి చెల్లించాలంటే ప్రజలకు భారంగా మారింది. దీంతో నల్లా, కరెంట్ బిల్లు తరహాలో నెలనెల ఆస్తిపన్ను చెల్లించే విధానం ప్రవేశపెడితే ప్రజలపై ఆర్థిక భారం పడకుండ సులభవాయిదా పద్ధతిలో చెల్లించనట్టుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నది. నెల నెలా ఆస్తి పన్ను జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. ఆస్తి పన్ను చెల్లించేందుకు యూపీఐతోపాటు అన్ని ఈ-పేమెంట్ ప్లాట్ ఫామ్ ల ద్వారా చెల్లించేలా సిటిజన్ ఫ్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.

నిర్ణీత గడువు

జీహెచ్‌ఎంసీ, జలమండలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు నిర్ణీత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింకు ఉండేలా చర్యలపై కసరత్తు చేయనున్నారు. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీలు, కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. బిల్లుల వసూళ్ల విషయంలో ఉన్నట్లుగా.. అంతే బాధ్యతగా ప్రజలకు అందించే సేవల విషయంలోనూ జవాబుదారీగా ఉండేవిధంగా విధివిధానాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఆదాయ మార్గాలపై దృష్టి

ప్రజలకు సేవలందించడమే కాకుండా ఆదాయమార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక అధికారులకు సీఎం సూచించినట్టు తెలిసింది. సంబంధిత పట్టణ స్థానిక సంస్థలో ఉన్న వనరులను గుర్తించాలని, అందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసినట్టు అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఎల్ఆర్ఎస్ పై వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలో కాకుండా నేరుగా కార్పొరేషన్ల ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed