బీసీ కమిషన్‌లో బెర్త్ ఎవరికి?.. చైర్మన్‌గా పార్టీ సీనియర్ లీడర్‌కు చాన్స్!

by Gantepaka Srikanth |
బీసీ కమిషన్‌లో బెర్త్ ఎవరికి?.. చైర్మన్‌గా పార్టీ సీనియర్ లీడర్‌కు చాన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కమిషన్ కొత్త పాలకవర్గం ఏర్పాటుపై సర్కారు దృష్టి సారించింది. ప్రస్తుతం కొనసాగుతున్న బాడీ పదవీకాలం ఈనెల 31తో ముగియనున్నది. కొత్తగా ఏర్పాటు చేసే పాలకవర్గంలో చైర్మన్, ముగ్గురు సభ్యులుగా ఎవరిని నియమించాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు ఆశావహులతో కూడిన జాబితాను సీఎంఓ అధికారులు సిద్ధం చేసినట్టు టాక్. ఆ వ్యక్తుల విషయంపై నిఘా వర్గాల నుంచి రిపోర్టు తెప్పించుకునే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు సమాచారం. అందరి వివరాలు వచ్చిన తర్వాత దానిని సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు.

చాన్స్ ఎవరికి?

చైర్మన్, సభ్యులుగా ఎవరిని నియమించాలి? అనే విషయంపై సీఎం రేవంత్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. చైర్మన్ పదవిని కేవలం పార్టీకి చెందిన నేతకే కట్టబెట్టాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొదటి నుంచి పార్టీలో ఉంటూ, పార్టీ విజయం కోసం పనిచేసి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు దక్కని ఓ సీనియర్ లీడర్ వైపు ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. కమిషన్‌లో సభ్యులుగా పార్టీ లీడర్లతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్లు, న్యాయవాదుల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. వారంలో నోటిఫై చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. చైర్మన్, సభ్యుల పేర్లను ఎంపిక చేసిన తర్వాత గవర్నర్ ఆమోదంతో గెజిట్ విడుదల చేయనున్నారు. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టగానే బీసీ కులగణన బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

సెప్టెంబరు‌లో కులగణన స్టార్ట్

బీసీల రిజర్వేషన్లు పెంచిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బీసీ కమిషన్‌కు కులగణన బాధ్యతలను అప్పగించనుంది. ఇప్పటికే అందుకోసం సర్కారు రూ.150 కోట్లు కేటాయించింది. కొత్త కమిషన్ ఏర్పాటైన వెంటనే కులగణన చేపట్టి, వీలైనంత త్వరగా రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం కోరునంది. యుద్దప్రాతిపదకన కులగణన పూర్తి చేయాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లను ఫైనల్ చేసి, ఎన్నికలు నిర్వహించనున్నారు.

పదవి కాపడుకునే ప్రయత్నం

ప్రస్తుతం కొనసాగుతున్న బీసీ కమిషన్ టీంలోని కొందరు వ్యక్తులు తమ పదవిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొత్తగా నియమించే టీంలో తమకు చాన్స్ ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా సీఎం రేవంత్ దృష్టిలో పడేందుకు వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హాయంలో అపాయింట్ అయిన వ్యక్తులను ప్రస్తుతం కొనసాగిస్తే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed