సర్కారు ద‌స‌రా కానుక.. ఇందిర‌మ్మ క‌మిటీల ఏర్పాటు

by M.Rajitha |
సర్కారు ద‌స‌రా కానుక.. ఇందిర‌మ్మ క‌మిటీల ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నది. ఇందుకోసం గ్రామం, వార్డు, మండలం, పట్టణం, అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు దిశగా ఆలోచనలు మొదలుపెట్టింది. ఈ కమిటీల విధివిధానాలను ఒకటి రెండు రోజుల్లో రూపొందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ అధికారులతో సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా దిశానిర్దేశం చేశారు. విధివిధానాలను అధికారులను రూపొందించిన వెంటనే అర్హులైన కుటుంబాలను గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టాలని సూచించారు. దసరా పండుగ నాటికే రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఏర్పాటు కావాలని నొక్కిచెప్పారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ న్యాయం జరగాలని, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఈ స్కీమ్ అమలు రోడ్ మ్యాప్‌పైనా జరిగిన ఈ సమావేశంలో అధికారుల నుంచి అవసరమైన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని, ఇత‌ర రాష్ట్రాలు ల‌క్షల సంఖ్యలో ఇండ్లను మంజూరు చేయించుకున్నాయి గుర్తుచేశారు. ఈ విష‌యంలో తెలంగాణ వెనుక‌బ‌డే ఉన్నద‌ని స్పష్టం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ద‌ఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గ‌రిష్ట సంఖ్యలో రాష్ట్రానికి దక్కేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిలను కూడా వీలైనంత తొందరగా రాబట్టుకునేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం కోరుతున్న స‌మాచారాన్ని వెంట‌నే ఇవ్వాల‌ని, ఇందిర‌మ్మ ఇళ్ల విష‌యంలో డాటాను కూడా ఎప్పటిక‌ప్పుడు పోర్టల్‌లో అప్‌డేట్ చేయడంతో పాటు సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు అందచేయాల‌న్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ, గ్రామీణ పథకాలు అమలవుతున్నందున వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫండింగ్ విధానాన్ని కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

పెద్ద సంఖ్యలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే తగినంత మంది ఇంజినీరింగ్ సిబ్బంది లభ్యం కాక ఇబ్బందులు ఎదుర‌య్యే ప‌రిస్థితి తలెత్తే ప్రమాదం ఉందనే అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. పేదలకు ఇండ్లను అందించడం ప్రధాన ప్రయారిటీ కావడంతో ఆ సమస్యను అధిగమించేందుకు అవ‌స‌ర‌మైతే ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధతిలో అర్హులైన ఇంజినీరింగ్ సిబ్బంది నియామ‌కాలు చేప‌ట్టాల‌ని సూచించారు.

రాజీవ్ స్వగృహ స్కీమ్ కింద ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌లను, ఇండ్లను వేలం వేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు. కన్‌స్ట్రక్షన్ పూర్తయినా వాటిని వినియోగించుకోలేని తీరులో ఏళ్ల త‌ర‌బ‌డి వాటిని వృథాగా ఉంచ‌డం స‌రికాద‌న్నారు. వెంట‌నే వేలానికి రంగం సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. గతంలో వేలం ప్రక్రియను చేపట్టినప్పుడు వచ్చిన ఫలితాలపైనా అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ‌బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయినా వాటిని ఇప్పటిదాకా ఎందుకు అప్పగించ‌లేద‌టూ అధికారుల నుంచి సీఎం ఆరా తీశారు. అర్హులైన కుటుంబాలకు ఆ ఇళ్లను వెంటనే అప్పగించేందుకు ప్రాసెస్ మొదలుపెట్టాలన్నారు. హైద‌రాబాద్ సిటీలో నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్పగించాల‌ని అధికారుల‌కు సూచించారు. ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ శేషాద్రి, సెక్రెటరీ చంద్రశేఖ‌ర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యద‌ర్శి జ్యోతి బుద్ధప్రకాష్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌత‌మ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed