బీఎస్పీ బీజేపీకి తోకపార్టీ.. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు

by Javid Pasha |
బీఎస్పీ బీజేపీకి తోకపార్టీ.. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఎస్పీ బీజేపీకి తోకపార్టీ అని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మాయావతి శకం ముగిసిందని అన్నారు. కులాల పేరిట, మతాల పేరిట కలహాలు సృష్టిస్తున్న బీజేపీని ప్రశ్నించకపోవడం అంటేనే ఆమె ఆర్థిక నేరాలకు పాల్పడిందని స్పష్టమవుతోందన్నారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీపై మాయావతి నోరు మెదపడం లేదన్నారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాయావతి తీరు చూసి కాన్షీరాం ఆత్మకూడా క్షోభిస్తుందన్నారు. కాన్షీరాం స్థాపించిన పార్టీ కదా అని బీఎస్పీ గురించి ఒక మాట అనాలంటే వెనకంజ వేసే వాళ్లం అన్నారు. కానీ మాయావతి కాన్షీరాం సిద్ధాంతాలను పూర్తిగా తుంగలో తొక్కారని, ఈ క్రమంలోనే బీఎస్పీని విమర్శించక తప్పడం లేదన్నారు. దళితులకు మాయావతి ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

బీఎస్పీ రాష్ట్ర నేత ప్రవీణ్ కుమార్ పై కేసీఆర్ నమ్మకముంచి గురుకులాల సొసైటీ కార్యదర్శి గా ఆరేళ్లు అవకాశం కల్పించారని, కానీ ఆయన మాత్రం పదవిని దుర్వినియోగం చేసి స్వేరో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు. ఆ సైన్యాన్ని ఇప్పుడు రాజకీయాలకు వాడుకుంటూ ప్రవీణ్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఆదరించకుంటే ప్రవీణ్ కుమార్ కోన్ కిస్కా లా ఉండే వారన్నారు. బీఎస్పీ ప్రభావం వల్లే అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు అని మాయావతి అనడం హాస్యాస్పదం అని, యూపీ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దళిత బంధు ఆలోచన మాయవతికి ఎందుకు రాలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ సత్తా ఏమిటో మునుగోడు ఉప ఎన్నికలో తేలిపోయిందని, బీఎస్పీకి 4 వేల ఓట్లు కూడా రాలేదన్నారు. ప్రవీణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినా బీఎస్పీ తెలంగాణలో లేచే పరిస్థితి లేదని, బీజేపీకి తోక పార్టీ గా ఉండాలనే ప్రవీణ్ కు రాష్ట్ర బీఎస్పీ పగ్గాలు అప్పగించారన్నారు.

బీజేపీ ఆగడాల పై మాయావతి నోరు విప్పి తన చిత్త శుద్ధిని చాటుకోవాలని సూచించారు. మాయావతి యూపీ సీఎంగా అంబేడ్కర్ విగ్రహాలు కాకుండా ఏనుగు విగ్రహాలను ప్రతిష్టించిందని, ఆమె ఓ అసమర్థ నాయకురాలిగా మిగిలిపోవద్దన్నారు. బీఎస్పీ తెలంగాణలో ఆధికారం అంటూ పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ మతతత్వ రాజకీయాలను ప్రశ్నించలేకపోతే బీఎస్పీకి మనుగడ లేదన్నారు. ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లో సుద్ద పూసలా మాట్లాడుతున్నారని, బీఎస్పీ సభకు డబ్బులు ఎక్కడనుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రచార ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నారు. బీఎస్పీ రాష్ట్ర స్థాయి సభకు బీఆర్ఎస్ నియోజక వర్గ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన జనం కూడా రాలేదన్నారు.


Advertisement

Next Story

Most Viewed