మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్.. నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్..

by Kavitha |
మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపాల్స్.. నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్..
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో అన్ని కాలేజీలకు ప్రిన్సిపాల్స్, ఆయా కాలేజీల అనుబంధ ఆసుపత్రులకు సూపరింటెండెంట్లను నియమించనుంది. ఈ పోస్ట్‌లును వారం రోజుల్లో భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రభుత్వానికి చేరింది. సీఎం నుంచి అప్రూవల్ రాగానే కాలేజీలకు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో అన్ని మెడికల్ కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు అందుబాటులోకి రానున్నారు. ఇందులో భాగంగానే ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇస్తున్నట్లు తెలిసింది. అన్ని మెడికల్ కాలేజీల్లో రెగ్యులర్ విధానంలో పోస్టులను భర్తీ చేసేందుకు ఐదేళ్లు ప్రోఫెసర్‌గా పనిచేసినోళ్లకు ప్రమోషన్లు కల్పిస్తూ, సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లుగా నియమించనున్నారు. ప్రస్తుతం డీఎంఈ పరిధిలో 69 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. కానీ.. వీటిలో కేవలం 17 మంది మాత్రమే రెగ్యులర్ అడిషనల్ డీఎంఈలు ఉన్నారు. మిగతా పోస్టులలో ఇన్‌చార్జి వ్యవస్థతో నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం ఇన్‌చార్జి వ్యవస్థకు చెక్ పెట్టి అన్ని పోస్టుల్లోనూ రెగ్యులర్ సిస్టమ్‌ను డెవలప్ చేసేందుకు వైద్యారోగ్యశాఖ చొరవ తీసుకున్నది.

స్టాఫ్ నియామకంలో గత సర్కార్ ఫెయిల్:

కొత్త రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా గత ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలను (మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట) ప్రారంభించింది. రెండో విడుత‌గా మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ఏర్పాటు చేసింది. మూడో విడుత‌గా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జనగాం జిల్లాల్లో ఏర్పాటు చేసింది. నాలుగో విడతలో జోగులాంబ గద్వాల్, నారాయణ్‌పేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో మెడికల్ కాలేజీల కోసం గత సర్కార్ దరఖాస్తు చేసింది. ఇందులో నాలుగు కాలేజీలకు పర్మిషన్లు రాగా, మిగతా కాలేజీల పర్మిషన్ల కోసం హెల్త్ సెక్రటరీ ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపారు. త్వరలోనే వాటికీ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే.. గత సర్కార్ అంకెల గారడీ తరహాలో కాలేజీల సంఖ్యను పెంచుతూ వెళ్లిందే కానీ, అందుకు అవసరమైన సౌకర్యాలు, స్టాఫ్‌ను నియమించడంలో ఫెయిలైంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా హెల్త్ మినిస్టర్ ఆదేశాలతో స్టాఫ్‌తోపాటు మానిటరింగ్ చేసేందుకు అన్ని స్థాయిలలో హెచ్‌వోడీలు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌ను డెవలప్ చేసేందుకు వైద్యారోగ్యశాఖ ప్రయత్నిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed