సమస్యల వలయంలో సర్కారు దవాఖాన

by Seetharam |   ( Updated:2023-06-07 14:57:23.0  )
సమస్యల వలయంలో సర్కారు దవాఖాన
X

దిశ, సైదాపూర్: గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్కారు దవాఖాన సమస్యల వలయంలో కూరుకుపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు వైద్యం కోసం సర్కారు దవాఖానకు వస్తే సరైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్వా‌స్వత వైద్యాధికారి లేక రాయికల్ పల్లె దవాఖానలో వైద్యునితో చూపించుకుంటున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు నెలల నుండి ల్యాబ్ టెక్నీషియన్ లేక పోవటంతో ఇబ్బందులు పడుతున్నారు.

రోగాలతో వైద్య పరీక్షలు చేసుకునేందుకు వచ్చిన రోగులకు పరీక్ష చేయడానికి టెక్నీషియన్ ఉండటం లేదు. రోగులతో పాటు గర్భిణీ స్త్రీలు కూడా పరీక్షలకు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించేందుకు రక్త నమూనాలను సేకరించి కరీంనగర్ జిల్లా ఆసుపత్రి పంపి రెండు రోజులకు రిపోర్ట్ ఇచ్చేవారు. రిపోర్ట్ ఆధారంగా మందులు పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవటంతో రక్త పరీక్షలు చేసుకునేందుకు రోగులు హుజూరాబాద్, కరీంనగర్ హన్మకొండ పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాస్వత వైద్యున్ని, ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించాలని మండల ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి జిల్లా వైద్యాధికారులను గతంలో పలుమార్లు కోరారు. అయినప్పటికీ జిల్లా వైద్యాధికారి పట్టించుకోక పోవటంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సాస్వత వైద్యుణ్ని, ల్యాబ్ టెక్నీషియన్‌ని నియమించి ప్రజలను రోగాల బారి నుంచి కాపాడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed