ఉన్న రేషన్‌ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర : మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

by Shiva |
ఉన్న రేషన్‌ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర : మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సామాన్యుల రేషన్ కార్డులు తొలగించేందుకు కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల అవినీతిని వెలికితీస్తానని అన్నారు. బీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చి కూడా ఎవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కేసీఆర్ ఆ మాటలు చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని ఆయన ఆరోపించారు.

ఇప్పుడు కాంగ్రెస్ సైతం రీడిజైన్ కోసం ఆలోచనలు చేస్తోందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను రోజుల కొద్దీ క్యూలైన్లలో నిలబెట్టారని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకం పెట్టారే కానీ, బస్సుల సంఖ్య పెంచలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్స్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి బస్ సౌకర్యం కల్పించలేదని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సుల సంఖ్య పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచితాల పేరుతో అప్పులు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని, ఇందులో కూడా బీఆర్ఎస్‌ను ఫాలో అవుతోందని అన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పని చేస్తున్నాయని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed