Telangana: రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి.. కలకలలాడుతోన్న ప్రాజెక్టులు

by Shiva |   ( Updated:2024-09-02 15:31:06.0  )
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా కుంభవృష్టి.. కలకలలాడుతోన్న ప్రాజెక్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అటు రైతుల్లో ఇటు ప్రభుత్వంలో ఆందోళన నెలకొన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇది ప్రభావం చూపింది. కాంగ్రెస్ అంటేనే కరువు అంటూ బీఆర్ఎస్ ఓపెన్‌గానే విమర్శలు చేసింది. కర్ణాటకలో తాగునీటి కష్టాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయని, ఇప్పుడు హైదరాబాద్‌కూ ఆ ప్రమాదం ఉన్నదంటూ ఇటీవలి వేసవిలో గులాబీ నేతలు విమర్శించారు. జూన్ నుంచి మొదలైన నైరుతి రుతుపవనాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇదే సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని నీటిని ఖాళీ చేయడంతో ఇక సాగుకు కష్టాలు మొదలైనట్లేనని రైతుల్లో ఆందోళన కలిగించేలా మాటలు వినిపించాయి. కానీ ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఒక్క తుపానుతో తీరిపోయినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సంవత్సరం వేసవి వరకు ఆందోళన పడాల్సిన పని లేకుండాపోయింది.

జూన్ నెలలో రుతు పవనాలతో రిజర్వాయర్లు, చెరువులు నిండకపోయినా భూగర్భ జలమట్టం పెరగడానికి దోహదపడింది. రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంటు లెక్కల ప్రకారం సాధారణంతో పోలిస్తే రుతుపవనాల ముందు వరకు మూడు రెట్లు నీటి మట్టం పడిపోయిందని తేలింది. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ సంవత్సరం జూన్‌లో గ్రౌండ్ పరిస్థితి దయనీయంగా మారడం రైతులకు ఆందోళన కలిగించింది. ఒకవైపు చెరువుల్లో నీరు లేకపోవడంతో వాటిని మోటారు పంపుసెట్ల ద్వారా పొలాలకు తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోరు బావులపై ఆధారపడలేకపోయారు. దీంతో కొత్త బోర్లు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం నెలకొన్నది. కొన్నిచోట్ల బోర్లు వేయడానికి గ్రామాల్లో లారీలు రాగానే ‘కాంగ్రెస్ మార్కు పాలన’ మొదలైందంటూ బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పించారు.

భూగర్భ జలాలు ఇంప్రూవ్

గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంటు లెక్కల ప్రకారం గతేడాది జూలైలో భూగర్భ జల‌మట్టం మొత్తం 33 జిల్లాలను సగటుగా తీసుకుంటే 6.17 మీటర్లు. అప్పటికి గతేడాది రుతుపవనాల ఎఫెక్టు కొంత కనిపించింది. ఈ ఏడాది మే నెలలో అది 10.36 మీటర్లకు పడిపోయింది. ఆదిలాబాద్ లాంటి జిల్లాలో గతేడాది జూలైలో 3.30 మీటర్లు ఉంటే (భూమి లోపల నీరు లభ్యమయ్యే లోతు) ఈ ఏడాది మే నాటికి అది 10.59 మీటర్లకు పడిపోయింది. ఈ సంవత్సరం జూన్‌లో వచ్చిన వర్షాలతో అది 8.29 మీటర్ల స్థాయికి చేరుకుని పరిస్థితి కొంత మెరుగుపడగా జూలై చివరి నాటికి 3.93 మీటర్లకు ఇంప్రూవ్ అయింది. అన్ని జిల్లాలను కలిపి సగటుగా తీసుకుంటే గతేడాది జూలైలో 6.17 మీటర్ల నుంచి ఈ సంవత్సరం మే నెలలో 10.58 మీటర్లకు, జూన్‌లో 9.90 మీటర్లకు, జూలైలో 8.25 మీటర్లకు ఇంప్రూవ్ అయింది.

ఇప్పుడు తుపాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. రానున్న రోజుల్లో దీన్ని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంటు విశ్లేషించి వివరాలను వెల్లడించనున్నది. కొత్త బోరుబావులు వేసుకోవాల్సిన అవసరం లేకుండా రైతులకు రిలీఫ్ ఇచ్చింది. గతేడాది నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు లేవనే అసంతృప్తి తాజా తుపానుతో బ్యాలెన్సు అయినట్లయింది. నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో 919 మి.మీ. మేర వర్షపాతం నమోదుకావాల్సి ఉంటే 738 మి.మీ. మాత్రమే కురిసినట్టు తేలింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణంగా కురవాల్సింది 551 మి.మీ. కాగా, వాస్తవిక వర్షపాతం 627 మి.మీ. కురిసిందని, ఇది 13.7 % ఎక్కువ అని అధికారులు తేల్చారు. గతేడాది ఇదే మూడు నెలల కాలంతో పోలిస్తే ఈసారి 5 % తక్కువ కురిసినా ఈ రెండు రోజుల ప్రభావం బాగా ఇంప్రూవ్ చేసినట్లయిందని భావిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి ఉపశమనం

తుపాను కారణంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కొన్ని జిల్లాల్లో అతివృష్టిగా కనిపించినా రాష్ట్రాన్ని సగటుగా తీసుకుంటే భూగర్భ జలమట్టం పెరుగుదలతో పాటు అనేక కోణాల్లో వ్యవసాయ రంగానికి ఉపశమనమేనని ఆఫీసర్లు భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల నుంచి సమకూరుతున్న రెవెన్యూ గణనీయంగా ఉండటంతో ఇప్పుడు కురిసిన వర్షాలు, గ్రౌండ్ వాటర్ మెరుగుదల బాగా ఉపయోగపడుతుందన్నది వారి వాదన. కాంగ్రెస్ అంటేనే కరువు అని విమర్శించే బీఆర్ఎస్ నేతలకు తాజా తుపాను ప్రభావిత వర్షాలు సమాధానం చెప్పినట్లయింది. తాజా వర్షాలతో వరినారుమళ్లకు ఏ మేరకు నష్టం జరిగిందో, రైతులకు ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో వ్యవసాయ శాఖ త్వరలో వివరాలను సేకరించి అంచనాకు రానున్నది. పలు ప్రాజెక్టుల్లోని మిగులు జలాలను పంపింగ్ చేసి కొన్ని రిజర్వాయర్లలో నిల్వ చేయడం ద్వారా వచ్చే వేసవికి తాగు, సాగునీటి కష్టాలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోడానికి ఉపయోగపడుతున్నది.

Advertisement

Next Story

Most Viewed