Good News: చివరి విడతకు నిధులు సిద్ధం..! పంద్రాగస్టున రూ.2 లక్షల రుణమాఫీ

by Shiva |
Good News: చివరి విడతకు నిధులు సిద్ధం..! పంద్రాగస్టున రూ.2 లక్షల రుణమాఫీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: చివరి విడత రుణమాఫీ కోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం రెడీ చేస్తున్నది. దాదాపు 6 లక్షల మంది రైతుల కోసం సుమారు రూ.8.5 వేల కోట్ల నిధులను సమకూర్చినట్టు తెలిసింది. పంద్రాగస్టు రోజున ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ స్కీమ్ ను కంప్లీట్ చేయనున్నారు. ఇప్పటికే రెండు విడుతల్లో 17,75,235 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం రూ. 12,22,498 కోట్ల రుణాలను మాఫీ చేసింది. అయితే రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణముంటే.. రైతులు ముందుగా అదనపు మెత్తాన్ని చెల్లించిన తరువాతే రుణమాఫీ చేయనున్నది

ఇచ్చిన మాట ప్రకారం..

పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ ప్రకటనను చూసిన విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవ చేశాయి. రూ.2 లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని, అంత మొత్తంలో నిధులు సేకరించడం సులువు కాదని విమర్శించాయి. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీ కోసం కావాల్సిన నిధుల సమీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం గడువులోపు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేయాలని కంకణం కట్టుకున్నారు.

అందులో భాగంగా ఇతర అనవసరాల కోసం ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం మాత్రమే నిధులను వ్యయం చేస్తున్నారు. మొదటి దశలో జూలై 18న లక్షలోపు రుణాలను మాఫీ చేసేందుకు 11,34,412 మంది రైతుల కోసం 6034.96 కోట్లను వ్యయం చేశారు. జూలై 29న రెండో దశలో 6,40, 823 మంది రైతులకు రూ. 6190.01 కోట్లు ఖర్చు చేసి లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేశారు. చివరి విడత ఆగస్టు 15న దాదాపు 6 లక్షల మంది రైతుల కోసం రూ. 8.5 వేల కోట్లను ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రెడీ గా ఉంది.

నిధుల సమీకరణలో సక్సెస్

రుణమాఫీ కోసం కావాల్సిన నిధుల సమీకరణలో ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించింది. భూములను విక్రయించకుండా, కుదవ పెట్టకుండానే.. చట్టం ప్రకారం ఎఫ్ఆర్బీఎం పరిధిలో అప్పులు చేసింది. అలాగే ఆర్బీఐ నియమాల ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నది. సేకరించిన నిధులను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయకుండా, కేవలం రుణమాఫీ కోసం మాత్రమే వెచ్చించింది. దీంతో చెప్పిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రూ. 2లక్షల వరకు రుణాలను మాఫీ చేయడానికి ప్రభుత్వానికి సులువైంది. మరోవైపు ప్రభుత్వ ప్రయారిటీ మేరకు ప్రతినెల ఒకటో తేదీన ఎంప్లాయీస్ కు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు కూడా అందించింది.

రూ. 2 లక్షల దాటిన రుణాలపై షరతులు

రూ. 2 లక్షల వరకు రుణం ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఆగస్టు 15న కేవలం రూ. 2 లక్షల వరకు అప్పు చేసిన రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు. ఆ తరువాత రూ. 2లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక టైమ్ షెడ్యూలును ప్రకటించి, బ్యాలెన్స్ అమౌంట్ ను కట్టేందుకు గడువు ఇవ్వనున్నారు. ఆ గడువులోపు రైతులు బ్యాలెన్స్ అమౌంట్ కట్టిన తరువాత రూ. 2 లక్షలను రైతుల అకౌంట్లలో వేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది.

Advertisement

Next Story