కేటీఆర్‌కు గోబెల్స్ అవార్డు ఇవ్వాలి: బండి సుధాకర్ గౌడ్

by Mahesh |
కేటీఆర్‌కు గోబెల్స్ అవార్డు ఇవ్వాలి: బండి సుధాకర్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ నది పునరుజ్జీవం అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అంతా ఆత్మస్తుతి, పరనింద లాగా ఉన్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ వాస్తవాలను వక్రీకరించి, అవాస్తవాలను వల్లెవేస్తూ, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ఏకపాత్రాభినయం చేసేందుకు ప్రయత్నించారన్నారు. కానీ ఇది అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు ప్రాజెక్టును ప్రారంభించే ముందే ప్రాధాన్యతలను తెలియజేస్తే, నిపుణులు విధి,విధానాలను, పునరావాస ప్యాకేజీలను, బడ్జెట్ అంచనాలను రూపొందించి నివేదిక సమర్పిస్తారన్నారు. అపుడు ప్రభుత్వం ఆ నివేదికపై పూర్తి స్థాయి సమీక్ష జరిపి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తుందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు ఈ మాత్రం తెలియదా ? అంటూ బండి సుధాకర్ గౌడ్ చురకలు అంటించారన్నారు.

మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా చెబితే, రూ.లక్షా 50 వేల కోట్ల రూపాయలు లూటీ జరుగుతుందని కేటీఆర్ గోబెల్స్ ప్రచారం చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని బండి దుయ్యబట్టారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు మూసీ నదిపై సమీక్ఝ చేసి, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఫిక్స్ చేసి, నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించింది నిజమే కదా? అని బండి గుర్తు చేశారు. వికారాబాద్ అనంతగిరి కొండల నుంచి నల్లగొండ జిల్లాలో కృష్ణా నదిలో కలిసే దాకా దాదాపు 3 లక్షల 25 వేల ఎకరాలకు సాగునీటికి, భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి ఉపయోగపడుతున్న మూసీని అవహేళన చేయడం కేటీఆర్ దురహంకారానికి నిదర్శనమన్నారు. అధికారం పోయిన బాధను జీర్ణించుకోలేని కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నాడని, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మబోరని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని బండి హెచ్చరించారు. కేటీఆర్ గోబెల్స్ అవార్డు ఇవ్వాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed