సిటీలో గంజాయి బ్యాచ్ హల్‌చల్.. అడ్డొస్తే ఇక అంతే..

by Prasad Jukanti |
సిటీలో గంజాయి బ్యాచ్ హల్‌చల్.. అడ్డొస్తే ఇక అంతే..
X

దిశ, డైనమిక్ బ్యూరో/ఉప్పల్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ హడలెత్తిస్తోంది. ఓవైపు సిటీలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టగా, మరోవైపు క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో గంజాయి సేవిస్తూ కొందరు యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. వారికి ఏమాత్రం అడ్డు చెప్పినా మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఉప్పల్ శాంతినగర్‌లో గంజాయి ముఠా హల్‌చల్ చేసింది. ఈ ఘటనలో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఈగ సంతోశ్‌తోపాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజుకో ఏరియాలో గంజాయి మత్తుగాళ్లు ప్రజలపై దాడులకు తెగబడటంతో ఏ క్షణం ఎలాంటి ముప్పు ఎదురవుతుందో అనే టెన్షన్ నగరవాసులను ఆందోళన కలిగిస్తోంది.

వరుస ఘటనలతో భయాందోళన..

ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఓ ఇంటి ముందు గంజాయి సేవిస్తుంటే ప్రశ్నించిన పాపానికి ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్ములపై రాళ్లతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. ఇదే నెలలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్‌లో గంజాయి బ్యాచ్ పండ్ల వ్యాపారులపై మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా పండ్ల షెడ్డును తగలబెట్టి బీభత్సం సృష్టించింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఉప్పల్ శాంతి‌నగర్‌లో క్రికెట్ ఆడుతున్న క్రమంలో బ్యాట్‌తో ఓ యువకుడిపై దాడికి పాల్పడింది. అడిగేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడితోపాటు ఏడుగురిపై రాడ్లు, కర్రలతో ఎటాక్ చేసి హల్‌చల్ చేసింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకోగా వారిపైకి కూడా దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే గంజాయి ముఠాల ఆగడాలు మీడియా ద్వారా వెలుగు లోకి వస్తున్నవి కొన్నేనని, ఇలాంటి చాలా జరుగుతున్నాయని నగరవాసులు చెబుతున్నారు. ఈ ముఠాల వల్ల ఉద్యోగాలకు వెళ్లి వచ్చే మహిళలు, యువతులు సహా చిన్నపిల్లలు భయంతో బిక్కుబిక్కుమనే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిఘా పెంచాల్సిందే..

గత కొంతకాలంగా నగరంలో గంజాయి సరికొత్త రూపాల్లో అందుబాటులోకి వస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు పలు ఘటనలు వెలుగు చూడటం, ఏకంగా ఆయా స్కూల్స్‌కు సమీపంలో విక్రయిస్తున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచే ఈ గంజాయి బ్యాచ్ మత్తులో తూగుతూ హడలెత్తిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పోలీసులు మరింత నిఘా పెంచాలని నగరవాసులు కోరుతున్నారు. దీనిపై సీఎం ఇదివరకే సమీక్ష నిర్వహించి వీటిపై ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశించిన నేపథ్యంలో.. అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed